టాలీవుడ్ లో తమిళ నటులు ఈ మధ్య తెగ బిజీ అవుతున్నారు. అందులో విజయ్ సేతుపతి ఒకరు. సైరాలో ఒక స్పెషల్ రోల్ తో తెలుగు జనాలకు బాగా దగ్గరైన విజయ్ ఇప్పుడు అదే పనిగా విలన్ రోల్స్ కి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. అది కూడా ఎక్కువగా మెగా హీరోలతోనే ఫైట్ చేయడానికి సిద్దమవుతుండడం విశేషం.  సైరా సినిమా టైమ్ లోనే మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమాలో విలన్ గా నటించడానికి విజయ్ సేతుపతి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

ఆ తరువాత అల్లు అర్జున్ సుకుమార్ సినిమాలో కూడా విలన్ గా నటించడానికి ఒప్పుకున్నాడు. ఇక ఎప్పుడూ మరో మెగా  హీరోతో పోట్లాడటానికి ఈ టాలెంటెడ్ హీరో సిద్దమైనట్లు సమాచారం. ఆ మెగా హీరో మరెవరో కాదు... వరుణ్ తేజ్.  గద్దల కొండ గణేష్ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న వరుణ్ నెక్స్ట్ బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు పంచ్ అనే టైటిల్ ని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక విలన్ పాత్ర కోసం చిత్ర యూనిట్ విజయ్ సేతుపతిని సంప్రదించినట్లు తెలుస్తోంది.

అల్లు అర్జున్ సినిమాలో నటించడానికి ఈ యాక్టర్ 10కోట్లకు పైగా డిమాండ్ చేసినట్లు టాక్ వస్తోంది. ఇక వరుణ్ సినిమాకి కూడా అదే రేంజ్ లో అందుకుంటాడా? అనే సందేహం కలుగుతోంది. మొత్తానికి విజయ్ సేతుపతి 2020లో ఎక్కువగా విలన్స్ రోల్స్ తోనే దర్శనమివ్వనున్నాడన్నమాట. మరో వైపు కోలీవుడ్ మాస్టర్ సినిమాలో కూడా విజయ్ నెగిటివ్ రోల్ లో కనిపిస్తున్న విషయం తెలిసిందే.