కరోనా లాక్ డౌన్‌ కారణంగా ప్రపంచమంతా స్థంబించి పోయింది. మన దేశంలో కూడా పూర్తిగా ప్రతీ ఒక్కరు ఇంటికే పరిమితమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ తమిళ స్టార్ హీరో మాత్రం లాక్‌ డౌన్‌ ను బ్రేక్ చేసి సాహసం చేశాడు. తమిళనాడుకు చెందిన సీనియర్‌ ఫిలిం జర్నలిస్ట్‌ నెల్లాయ్‌ భారతి కన్నుమూశారు. కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం ఉదయం చెన్నైలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.

ఆయన భౌతికకాయన్ని పోరూర్‌లోని ఇంటికి తరలించారు. చివరి చూపుకోసం కుటుంబ సభ్యులతో పాటు సన్నిహితులు హాజరయ్యారు. అయితే ఆయను వీడ్కోలు పలికేందుకు కోలీవుడ్‌ స్టార్ హీరో విజయ్ సేతుపతి లాక్ డౌన్‌ నిబంధనలను బ్రేక్ చేసి మరీ వెళ్లారు. భారతి కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేసిన విజయ్‌, అంత్యక్రియల్లోనూ పాల్గొన్నారు. ఆయన కుటుంబానికి తోడుగా ఉంటానని భరోసా ఇచ్చారు.

వారి కుటుంబానికి ఆర్థిక సాయం కూడా అంధించారు. అంత్యక్రియలు ఖర్చులు కూడా ఆయనే భరించారు. తన పాత స్నేహితుడి కోసం నిబంధనలు కూడా పక్కన పెట్టి వచ్చిన విజయ్ సేతుపతిని పలువురు అభినందిస్తున్నారు. అయితే ఇలాంటి కఠిన సమయంలో నిబంధలను ఉల్లంఘించటం తప్పని చెప్పేవారు కూడా లేకపోలేదు. ప్రస్తుతం విజయ్‌ సేతుపతి కోలీవుడ్‌ విజయ్‌ హీరోగా తెరకెక్కుతున్న మాస్టర్ సినిమాలో విలన్‌గా నటిస్తున్నాడు, తెలుగులో సాయి ధరమ్‌ తేజ్‌ తమ్ముడు వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా తెరకెక్కుతున్న ఉప్పెన సినిమాలోనూ కీలక పాత్రల్లో నటిస్తున్నాడు.