తమిళ స్టార్ హీరో తలపతి విజయ్ హీరోగా.. విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తోన్న చిత్రం 'మాస్టర్'. ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తోన్న సినిమా కావడంతో కోలీవుడ్ లోనే కాకుండా దక్షిణాది సినిమా అభిమానులంతా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇదిలా ఉండగా.. చిత్రబృందం సినిమాకి సంబంధించిన అప్డేట్ తో పాటు అభిమానుల కోసం ఓ ఫోటోని రిలీజ్ చేశారు. ఆ ఫోటోలో విజయ్ సేతుపతి విజయ్ కి ముద్దు పెడుతూ ఉన్నాడు. 'మాస్టర్' సినిమా షూటింగ్ పూర్తయిందని.. పోస్ట్ ప్రొడక్షన్ మాత్రమే మిగిలి ఉందని చిత్రబృందం పేర్కొంది.

ఏప్రిల్ 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్, సెకండ్ లుక్ లు అభిమానులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో విజయ్ కాలేజ్ స్టూడెంట్ గా, ఆచార్యుడిగా రెండు పాత్రలు పోషించనున్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ సినిమా ఓ కొరియన్ సినిమాకి కాపీ అంటూ కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అలాంటిదేమీ లేదని.. సినిమా చూస్తే కథ అర్ధమవుతుందని చిత్రబృందం చెబుతోంది. లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో విజయ్ సరసన మాళవిక హీరోయిన్ గా కనిపించనుంది. అనిరుద్ సంగీతం అందిస్తున్నారు.