కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ మరొకసారి మీడియాలో హాట్ టాపిక్ గా మారుతున్నాడు. కొన్ని వారల క్రితం విజయ్ ని ఐటి అధికారులు విచారించిన విషయం తెలిసిందే. మాస్టర్ సినిమా షూటింగ్ స్పాట్ లో కొన్ని గంటల పాటు విచారణ జరిపి షూటింగ్ అనంతరం విజయ్ ఇంట్లో కూడా తనికీలు నిర్వహించారు.

ఆ ఘటన తమిళనాడులో అందరిని షాక్ కి గురి చేసింది.  తరువాత రోజు విజయ్ అభిమానులు వేల సంఖ్యలో విజయ్ ని చూడటానికి షూటింగ్ స్పాట్ కి వెళ్లారు. ఇక సినిమాకు సంబందించిన ఆడియో ఈవెంట్ పైనే అందరి చూపు మళ్ళింది. ఈ నెల 15న చెన్నై లో భారీగా ఈవెంట్ ని నిర్వహించనున్నారు. వేడుకలో విజయ్ ఏం మాట్లాడుతాడా అనేది అందరిలో ఆసక్తిని కలిగిస్తోంది.

ఇన్కమ్ ట్యాక్స్ దాడుల తరువాత విజయ్ ఎక్కడ కూడా పెద్దగా మాట్లాడింది లేదు.  దీంతో మాస్టర్ ఆడియో లాంచ్ లో విజయ్ ఎవరికీ కౌంటర్ ఇస్తాడు అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. గతంలో బిగిల్ ఈవెంట్ లో అనవసరంగా తన ఫ్యాన్స్ ని కొంతమంది టార్గెట్ చేసి దాడులు చేస్తున్నారని కామెంట్ చేశాడు.

రాజకీయ నాయకులపై ఇన్ డైరెక్ట్ గా సెటైర్స్ వేసిన విజయ్ ఇటీవల తనపై ఐటి దాడులపై కూడా స్పందించే అవకాశం ఉన్నట్లు టాక్ వస్తోంది. తమిళ్ లో మూడు ఛానెల్స్ లో వేడుక ప్రత్యేక ప్రసారం కానుంది. భారీ హైప్ క్రియేట్ చేస్తున్న మాస్టర్ ఆడియో ఈవెంట్ ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి. అనిరుద్ సంగీతం అందించిన ఈ సినిమాకు లోకేష్ కనగరాజన్ దర్శకత్వం వహించాడు.