దక్షిణాదిలో సినీ తారల్ని అభిమానులు ఆరాధ్య దైవాలుగా భావిస్తారు. తమ అభిమాన నటుల కోసం ఫ్యాన్స్ మధ్య తరచుగా గొడవలు జరుగుతూనే ఉంటాయి. దక్షిణాదిలోనే ఈ పరిస్థితి ఎక్కువ. ముఖ్యంగా తమిళనాడులో. తమ హీరో గొప్పంటే.. తమ హీరోనే గొప్ప అంటూ  విజయ్, అజిత్, రజనీకాంత్ అభిమానుల మధ్య తరచుగా వాదనలు జరుగుతుండడం చూస్తూనే ఉన్నాయి. 

ఇదిలా ఉండగా తాజాగా తమిళనాడులో దారుణమైన సంఘటన జరిగింది. విజయ్, రజనీకాంత్ అభిమానుల మధ్య మొదలైన గొడవ మరణానికి కారణం అయింది. వివరాల్లోకి వెళితే.. దినేష్ బాబు అనే యువకుడి రజనీకాంత్ అభిమాని.. యువరాజ్ అనే యువకుడు విజయ్ అభిమాని. 

వీరిద్దరి మధ్య రజని, విజయ్ గురించి సరదాగా గొడవ మొదలైంది. కరోనా నివారణకు గాను ఈ హీరోలిద్దరూ ఇచ్చిన విరాళాల గురించి విజయ్, దినేష్ బాబు మధ్య చర్చ జరిగింది. ఈ క్రమంలో తమ హీరోనే గొప్ప అంటూ ఇద్దరూ వాదులాడుకున్నారు. గొడవ తీవ్రంగా మారిన తర్వాత దినేష్ బాబు.. యువరాజ్ ని గట్టిగా నెట్టాడు. దీనితో యువరాజ్ కింద పడడంతో తలకు బలమైన గాయం తగిలింది. దీనితో యువరాజ్ అక్కడికక్కడే మృతి చెందాడు. 

పోలీసులు కేసు నమోదు చేసి దినే ష్ బాబుని అదుపులోకి తీసుకున్నారు. గొడవ  జరిగిన సమయంలో స్నేహితులిద్దరూ మద్యం సేవించి ఉన్నట్లు తెలుస్తోంది.