మన హీరోలందరికీ యుఎస్ మార్కెట్ బాగా కలసి వస్తోంది. ఓవర్ సీస్ బిజినెస్ ని లెక్కేసుకుని నిర్మాత ప్రీ రిలీజ్ బిజినెస్ మొదలెడుతున్నారు. ఒకప్పుడు నామమాత్రంగా ఉన్న ఓవర్ సీస్ బిజినెస్ ఈ రోజు ప్రత్యేకంగా లెక్కేసుకునే స్దితికి చేరింది. ఈ క్రమంలో చాలా మంది హీరోలు లబ్ది పొందుతున్నారు. పెళ్లి చూపులు,అర్జున్ రెడ్డి ఘన విజయం తర్వాత విజయ్ దేవరకొండ అనేది ఒక బ్రాండ్ గా యుఎస్ మార్కెట్లో సెటైలింది.

ఇప్పటి వరకు ఒక్క స్టార్ డైరెక్టర్‌తో సినిమా చేయనప్పటికి.. విజయ్ దేవరకొండ తెలుగు ఇండస్ట్రీలో సూపర్ స్టార్‌డమ్‌ను తెచ్చుకుని తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకోవటం అతని స్టామినా ఏంటో చెప్తోంది.  తన తెలివితేటలతో ప్రతి సినిమాను విభిన్న రీతిలో ప్రచారం చేసుకోవడం ఈ రౌడీ స్పెషాలిటి.  అలాగే విజయ్ సినిమా వస్తుందంటే రెండు తెలుగు రాష్ట్రాల్లోని విజయ్ అభిమానులే కాకుండా విదేశాల్లో ఉన్న తెలుగు వారు కూడా వెయ్యి కళ్లతో ఎదురు చూస్తూ ఉంటారు.

విజయ్ దేవరకొండ గత చిత్రాలైన పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, గీతా గోవిందం చిత్రాలు అమెరికాలో అత్యధిక వసూళ్లను రాబట్టాయి.   ఇదే తన చివరి లవ్ స్టోరీ అని చెప్పిన విజయ్ దేవరకొండ.. వరల్డ్ ఫేమస్ చిత్రంలో ఒకేసారి నలుగురు భామలతో కలిసి నటించి సినిమాపై అంచనాలను పెంచేశాడు.  ఈ చిత్ర అమెరికా రైట్స్‌ను మూన్ షైన్ సినిమాస్ దక్కించుకుంది.

మరోపక్క ఈ సినిమా టికెట్లపై అమెరికాలోని అనేక సంస్థలు భారీ ఆఫర్లను కూడా ప్రకటించాయి. అమెరికాలో ఈ చిత్ర ప్రీమియర్లు ఫిబ్రవరి 13న పడ్డాయి. అయితే ప్రీమియర్  షోకే ప్లాప్ టాక్ తెచ్చుకుంది.  వేలంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కాన్సెప్టు విభిన్నంగా ఉన్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం నిర్మాతకు నష్టాలే మిగిల్చింది.  అలాగే అమెరికా డిస్ట్రిబ్యూటర్స్ కు నష్టాలనే మిగల్చింది.

అప్పటికీ ఈ సినిమాకు స్పెషల్ ఆఫర్స్ ప్రకటించారు. రీగల్ అన్‌లిమిటెడ్‌, ఏఎమ్‌సీ స్టబ్స్ ఏ లిస్ట్ ద్వారా వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాను ఉచితంగా చూసే అవకాశముంది. అదే విధంగా సినిమ్యాక్స్ మూవీ క్లబ్‌తో ఈ సినిమా టికెట్‌పై ఆరు డాలర్ల ఆఫర్‌ను పొందవచ్చు. వీటితో పాటు మూన్ షైన్ సినిమాస్ కూడా అమెరికాలో ఉన్న వారికి భారీ ఆఫర్‌ను ప్రకటించింది. వరల్డ్ ఫేమస్ లవర్ చిత్ర కథను కనిపెట్టి మెయిల్ చేసిన వారికి 50 డాలర్ల అమెజాన్ వోచర్‌ను ఉచితంగా అందిస్తామంటూ వినూత్నంగా ప్రచారం మొదలుపెట్టింది.

కానీ అవేమీ ఫలించలేదు.  దాంతో ఇప్పుడు విజయ్ దేవరకొండ సినిమా అంటే యుఎస్ డిస్ట్రిబ్యూటర్స్ భయపడే పరిస్దితి ఏర్పడింది. ఖచ్చితంగా ఇది పూరి జగన్నాథ్ తో చేస్తున్న సినిమా బిజినెస్ పడనుందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. దానికి తోడు పూరి జగన్నాథ్ సినిమాలు కు సైతం ఓవర్ సీస్ లో  చెప్పుకోదగ్గ క్రేజ్ ఉండదు. గీతా గోవిందం తర్వాత యుఎస్ లో చెప్పుకోదగ్గ హిట్ లేకపోవటం విజయ్ దేవరకొండకు ఓవర్ సీస్ లో పెద్ద ఎదురు దెబ్బే అంటున్నారు.