అతి తక్కువ టైమ్ లోనే టాలీవుడ్ లో తనకంటూ ఓ స్దానం ఏర్పాటు చేసుకుని దూసుకుపోతున్న సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ. అతను ఏం మాట్లాడినా సంచలనం. ఏ సినిమా చేసినా ఓ రేంజిలో ఓపినింగ్స్. తమిళంలోనూ గీతా గోవిందం హిట్ తో తనకంటూ ఓ స్దానం ఏర్పాటు చేసుకున్నాడు. డియర్ కామ్రేడ్ సినిమాతో బాలీవుడ్ ప్రముఖ నిర్మాత, దర్శకుడు కరణ్ జోహార్ దృష్టిలో పడ్డాడు.

దాంతో ఆయనపైనే జనం అందరి దృష్టి. అందుకే గూగూల్ లో విజయ్ దేవరకొండ కోసం ఎక్కువ మంది సెర్చ్ చేసారు.  దాంతో 2019 లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన సౌత్ ఇండియన్ స్టార్ గా ఎంపికయ్యాడు. గత సంవత్సరం కూడా  మోస్ట్ డిజైర‌బుల్ మెన్ ఆఫ్ 2018గా ఎంపిక‌య్యాడు. అది కూడా మ‌హేష్ బాబు, ప్ర‌భాస్, జూనియ‌ర్ ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ లాంటి హీరోలంద‌ర్నీ వెన‌క్కి నెట్టి ఈ రికార్డు చేరుకున్నాడు విజ‌య్.

వరసపెట్టి పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి , గీతగోవిందంతో హిట్స్ తో తెలుగులో నిలదొక్కుకున్నాడు విజయ్ . ఆ త‌ర్వాత  చేసిన టాక్సీవాలా సినిమా కూడా మంచి విజ‌యం సాధించింది. వీక్ కంటెంట్ ఉన్నా కలెక్షన్స్ ఇరగతీసింది. డియర్ కామ్రేడ్ సినిమా మాత్రమే నిరాశపరిచింది. దాంతో విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమా అంటే  మినిమం గ్యారెంటి అనే  అనుకుంటున్నారంతా. వ‌ర‌స సంచ‌ల‌నాల‌తో న్యూ స్టార్ ఆఫ్ తెలుగు సినిమాగా మారాడు విజయ్ దేవరకొండ.

ప్రస్తుతం పూరి జగన్నాథ్ తో కలిసి ఫైటర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో బాలీవుడ్ లోనూ ఎంట్రీ ఇస్తున్నట్లు సమాచారం.  ఫైటర్ కథ,కథనం పాన్ ఇండియాకు అప్పీల్ అవుతుందని భావించిన కరణ్ జోహార్, పూరి, ఛార్మిలతో కలిసి ఈ చిత్ర నిర్మాణంలో పాలు పంచుకుంటున్నట్లు సమాచారం. ఫైటర్ వచ్చే సంవత్సరం మొదటి నెలలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.