ఆదివారం రోజు బిగ్ బాస్ హౌస్ లో జరగబోయే ఎలిమినేషన్ ప్రేక్షకుల్లో ఉత్కంఠ పెంచుతోంది. అదేవిధంగా మంచి వినోదాత్మక కార్యక్రమాలతో నాగార్జున సండే ఎపిసోడ్ కోసం సిద్ధం అవుతున్నారు. బిగ్ బాస్ సగం సీజన్ గడిచేవరకు అసలు రేసులో లేని రాహుల్ ఏకంగా ఫైనల్ కు చేరిపోయాడు. ఊహించిన విధంగానే శ్రీముఖి, బాబా భాస్కర్ ఫైనల్ బెర్తులని ఖరారు చేసుకున్నారు. 

ఇక వరుణ్ సందేశ్, అలీ రెజా, శివజ్యోతిలలో ఒకరు ఎలిమినేట్ అయి.. ఇద్దరు ఫైనల్ కు చేరాల్సి ఉంది. అందుతున్న లీకుల ప్రకారం శివజ్యోతి ఎలిమినేట్ కావడం ఖాయం అంటూ వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో కూడా ప్రేక్షకులు ఇదే అంశాన్ని చర్చించుకుంటున్నారు. అలీ, వరుణ్ లతో పోల్చుకుంటే శివజ్యోతికి తక్కువ ఓట్లు వచ్చినట్లు టాక్. 

ఇదిలా ఉండగా ఈ రోజు ఎపిసోడ్ లో మరో సర్ప్రైజ్ ఉంది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఇప్పటి వరకు బిగ్ బాస్ సీజన్ 3లో సెలబ్రిటీలు ఎవరూ హౌస్ లోకి ప్రవేశించలేదు. కేవలం నాగ్ పక్కన వేదికపై మాత్రమే హౌస్ మేట్స్ కు కనిపించారు. 

కానీ తొలిసారి విజయ్ దేవరకొండ హౌస్ లోకి సీక్రెట్ గా ప్రవేశించి ఇంటి సభ్యులని కలుసుకోబోతున్నాడు. తాజాగా విడుదల చేసిన ప్రోమోలో ఆ దృశ్యాల్ని చూపించారు. విజయ్ దేవరకొండ హౌస్ మేట్స్ కి తెలియకుండా సీక్రెట్ రూమ్ లోకి ప్రవేశించగా.. మొదట అతడిని కలుసుకునే అవకాశం శివజ్యోతికి వచ్చింది. 

ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న అల్లు అర్జున్ 'రాములో రాములా' పాటకు నాగ్ స్టెప్పులేస్తూ వేదికపై ఎంట్రీ ఇస్తున్నాడు. నాగ్, విజయ్ దేవరకొండ మధ్య పెళ్లి గురించి సంభాషణ జరిగింది. విజయ్.. ప్రతి ఆరు నెలలకు నీ పెళ్లి గురించి రూమర్స్ వస్తున్నాయి ఏంటి అని నాగార్జున ప్రశ్నించగా.. తాను అమల లాంటి భార్య కోసం వెతుకుతున్నాను అని విజయ్ దేవరకొండ సమాధానం ఇచ్చాడు. నీకు అమల లాంటి భార్య దొరకాలి అంటూ నాగ్ విజయ్ దేవరకొండని ఆశీర్వదించడం సరదాగా ఉంది.