విజయ్ దేవరకొండ నిర్మాణంలో తెరకెక్కిన చిత్రం 'మీకు మాత్రమే చెప్తా'. షమీర్ సుల్తాన్ ఈ చిత్రానికి దర్శకుడు. పెళ్లి చూపులు దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. వాణి భోజన్ కథానాయిక. స్టార్ యాంకర్ అనసూయ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోంది. 

కొద్దిసేపటి క్రితమే 'మీకు మాత్రమే చెప్తా' ట్రైలర్ విడుదల చేశారు. స్వయంగా సూపర్ స్టార్ మహేష్ బాబు తన చేతుల మీదుగా ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ చేయడం విశేషం. ట్రైలర్ లోని విశేషాలని గమనిస్తే.. యువతకు నచ్చే ఫన్ ఎలిమెంట్స్ అదిరిపోయాయి. 

పెళ్ళికి సిద్ధమయ్యే ఓ యువకుడి తన ఫోన్ వీడియోతో ఎలా చిక్కుల్లో పడ్డాడు అనే అంశంతో ఈ చిత్రం ఉండబోతోంది. ట్రైలర్ మొత్తం కమెడియన్ వెన్నెల కిషోర్ వాయిస్ ఓవర్ తో ఉంటుంది. 

ప్రస్తుతం యువత సెల్ ఫోన్ కు ఎలా బానిసలుగా మారారనే అంశాల్ని చాలా ఫన్నీగా చూపించారు. 'మన లైఫ్ మన చేతులో ఉందో లేదో తెలియదు కానీ మనందరి చేతులో ఖచ్చితంగా ఫోన్ ఉంటుంది' అంటూ వెన్నెల కిషోర్ చెప్పే వాయిస్ ఓవర్ తో ట్రైలర్ ప్రారంభం అవుతుంది. 

ఓ వీడియో గురించి హీరో టెన్షన్ పడుతూ కనిపిస్తాడు.. నా పెళ్లి ఆగిపోతుంది.. అమ్మానాన్న దగ్గర పరువు పోతుంది. నాకు పుట్టబోయే కొడుకే నానా వీడియో చూస్తే అంతకంటే ఘోరం ఇంకొకటి ఉండదు అంటూ తరుణ్ భాస్కర్ చెప్పే డైలాగులు ఆకట్టుకుంటున్నాయి.