ప్రస్తుతం టాలీవుడ్‌లో బీ ద రియల్ మెన్ ఛాలెంజ్‌ ఓ రేంజ్‌లో ట్రెండ్ అవుతుంది. అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా మొదలు పెట్టిన ఈ ఛాలెంజ్‌ రాజమౌళి నుంచి స్టార్ హీరోలు, టాప్‌ డైరెక్టర్లు, నిర్మాతలు అందరికి వచ్చింది. అయితే తాజాగా ఎన్టీఆర్ నుంచి ఛాలెంజ్‌ను స్వీకరించిన దర్శకుడు కొరటాల శివ తాను ఇంటి పనులు చేస్తున్న వీడియోను సోషల మీడియా పేజ్‌లో పోస్ట్ చేశాడు. తన తరువాత ఈ ఛాలెంజ్‌ కొనసాగించాల్సిందిగా సెన్సేషనల్ స్టార్‌ విజయ్‌ దేవరకొండను సవాల్‌ చేశాడు.

అయితే ఇప్పటి వరకు దాదాపు అందరు హీరోలు ఈ ఛాలెంజ్‌ను యాక్సెప్ట్ చేయగా, విజయ్ దేవరకొండ మాత్రం ఫన్నీగా రిజెక్ట్ చేశాడు. `శివ సర్‌, మా మమ్మీ నన్ను పని చేయనీట్లే.. పని డబుల్ అవుతుందంట.. ఇంట్లో ఇంకా మగాడిలా చూడటంలే మమ్మల్ని. పిల్లల్లానే ట్రీట్ చేస్తున్నారు. అయితే నేను లాక్‌ డౌన్‌లో నా రోజు ఎలా గడుస్తుందో చూపిస్తాను` అంటూ రిప్లై ఇచ్చాడు విజయ్.

ఇటీవల వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాతో దారుణంగా నిరాశపరిచిన విజయ్‌, ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పాన్‌ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు. పూరితో కలిసి బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్‌ జోహార్ నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. మాఫియా బ్యాక్‌ డ్రాప్‌లో రూపొందుతున్న ఈ సినిమాలో విజయ్ ఫైటర్‌గా నటిస్తున్నాడన్న టాక్ వినిపిస్తోంది.