ప్రస్తుతం కరోనా లాక్‌ డౌన్‌ కారణంగా సెలబ్రిటీలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో ఖాళీగా ఉన్న తారలు తమ అభిమానులను ఎంటర్‌టైన్‌ చేసేందుకు రకరకాల ప్లాన్స్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఓ కొత్త చాలెంజ్‌ను తెర మీదకు తీసుకువచ్చాడు. ఇంట్లోనే ఉన్న స్టార్స్ ఇంటి పనులు చేస్తున్న వీడియోలను అభిమానులతో షేర్ చేసుకోవాల్సింది రాజమౌళిని ఛాలెంజ్‌ చేశాడు. అయితే ఈ ఛాలెంజ్‌ కరోనా కన్నా వేగంగా స్ప్రెడ్ అవుతుంది.

ఇప్పటికే రాజమౌళి, ఎన్టీఆర్‌, రామ్ చరణ్‌, చిరంజీవి, వెంకటేష్‌, కీరవాణి, సుకుమార్ లాంటి వారు ఈ ఛాలెంజ్‌ను పూర్తి చేయగా దర్శకుడు కొరటాల శివ, ఛాలెంజ్ స్వీకరించాల్సిందిగా విజయ్ దేవరకొండను కోరాడు. అయితే ఈ విషయంలో కూడా విజయ్ తన మార్క్ చూపించాడు. ఇంట్లో మా అమ్మ నన్ను ఇంటి పని చేయనివ్వటం లేదంటూ, లాక్ డౌన్‌ సమయంలో తన రోజు ఎలా గడుస్తుందో చూపించాడు. గతంలో కేవలం 6 గంటలు మాత్రమే నిద్రపోయే వాడినని చెప్పిన విజయ్‌, ప్రస్తుతం రోజుకు తొమ్మిదిన్నర గంటల పాటు నిద్రపోతున్నాడట.

లేచిన తరువాత ఫ్రెష్ అవ్వటం, వీడియో గేమ్స్ ఆడటం, తమ్ముడితో తల్లితో కలిసి ఇండోర్‌ గేమ్స్ ఆడటం లాంటి వాటితోనే విజయ్‌ టైం పాస్ చేస్తున్నాడు. దీంతో రౌడీ రొటీన్‌ మరీ బోరింగ్‌గా ఉందంటున్నారు ఫ్యాన్స్‌. ఈ డెయిలీ రొటీన్‌ అంతా ఆనంద్‌ దేవరకొండ చిత్రీకరించగా తన సోషల్ మీడియా పేజ్‌లో షేర్‌ చేశాడు విజయ్‌. బీ ద రియల్ మెన్‌ చాలెంజ్‌ను కొనసాగిస్తూ మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్‌ సల్మాన్‌ను ఛాలెంజ్‌ చేశాడు.