టాలీవుడ్ రౌడీ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ ఏడాది గ్యాప్ లోనే ఊహించని అపజయాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. అర్జున్ రెడ్డి - గీత గోవిందం సినిమాల తరువాత ఇలాంటి హీరోతో ఎలాగైనా ఒక సినిమా చేయాలనీ స్టార్ దర్శకులు కూడా అనుకున్నారు అంటే విజయ్ క్రేజ్ ఏ రేంజ్ కి వెళ్లిందో చెప్పనవసరం లేదు.

ఇక ఈ మధ్య  వరల్డ్ ఫెమస్ లవర్ మాములు దెబ్బ కొట్టలేదు. సినిమా భారీగా నష్టాలను మిగిల్చింది. అయినప్పటికీ రెండవసారి కూడా టైమ్స్ విడుదల చేసిన హైదరాబాద్ మోస్ట్ డిసైరబుల్ మెన్ లిస్ట్ లో మొదటి స్థానం సంపాదించుకున్నాడు. అసలు మ్యాటర్ లోకి వస్తే.. గత కొంతకాలంగా విజయ్ దేవరకొండ ప్రేమలో ఉన్నట్లు టాక్ వస్తోన్న విషయం తెలిసిందే. ఆ విషయంపై రౌడీ స్టార్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించాడు.  

'ప్రేమ అనేది దాచే విషయం కాదు, అలాగని ఆ విషయాన్ని బయటపెట్టడం నాకు ఇష్టం లేదు. అది నా వ్యక్తిగత విషయం. ఒకవేళ నేను ప్రేమలో పడితే మొదట మా అమ్మ నాన్నలకు మాత్రమే చెబుతాను. ఆ విషయం బయట ఒక ఎంటర్టైన్మెంట్ గా మారడం నాకు నచ్చదు.సమయం వచ్చినప్పుడు ఏ విధంగా దాన్ని అందరికి చెప్పాలనే విషయం నాకు తెలుసు' అని విజయ్ వివరణ ఇచ్చాడు.

విజయ్ దేవరకొండ నెక్స్ట్ ఫైటర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా ఫిల్మ్ గా తెరకెక్కుతున్న ఆ సినిమాకు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నాడు. అలాగే విజయ్ మరో రెండు సినిమాలను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు.