విక్టరీ వెంకటేష్ మరో సంచలన ప్రయోగానికి తెరతీశారు. ఇటీవల వెంకీ ఎక్కువగా మల్టీస్టారర్ చిత్రాలకు, ప్రయోగాత్మక చిత్రాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ ఏడాది వెంకీ ఎఫ్ 2 చిత్రంతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం డైరెక్టర్ బాబీ తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ చిత్రం వెంకీ మామలో నటిస్తున్నాడు. 

ఈ మూవీలో నాగ చైతన్య మరో హీరోగా చేస్తున్నాడు. త్వరలో ఈ వినోదాత్మక చిత్రం విడుదుల కాబోతోంది. ఇంతలోనే వెంకటేష్ నుంచి అభిమానులు ఆశ్చర్యపోయే ప్రకటన వచ్చింది. ధనుష్ నటించిన అసురన్ చిత్రం తమిళనాట సంచలన విజయం దిశగా దూసుకుపోతోంది. 

ధనుష్ ఈ చిత్రంలో మధ్య వయస్కుడిగా, యువకుడిగా అద్భుత నటనతో ఆకట్టుకున్నాడు. దర్శకుడు వెట్రి మారన్ ఈ చిత్రాన్ని తెరక్కించారు. ఊర మాస్ లుక్ లో ధనుష్ నటనకు ఆడియన్స్ తో పాటు సెలబ్రిటీలు కూడా ఫిదా అయ్యారు. 

కులం, భూ వివాదాల నేపథ్యంలో వెట్రి మాత్రం ఈ చిత్రాన్ని ఆధ్యంతం ఉత్కంఠ భరితంగా నడిపించారు. మంజు వారియర్ హీరోయిన్ గా నటించింది. ఈ కథ వెంకీకి సరిపోతుందని భావించి అసురన్ నిర్మాత వెంకటేష్ ని సంప్రదించడం, వెంకీ ఓకె చెప్పడం చకచకా జరిగిపోయాయి. 

తమిళంలో అసురన్ చిత్రాన్ని నిర్మించిన ఎస్ థాను, వెంకీ సోదరుడు సురేష్ బాబు కలసి ఈ మూవీని నిర్మించబోతున్నారు. తాజాగా సురేష్ ప్రొడక్షన్స్ సంస్ధ ఈ క్రేజీ న్యూస్ ని ప్రకటించింది. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.