ముంబై: ప్రముఖ బాలీవుడ్ నటుడు, కమెడియన్ జగదీప్ ఇక లేరు. సయ్యద్ ఇస్తియాక్ అహ్మద్ జాప్రీ అలియాస్ జగదీప్ బుధవారం ముంబైలో కన్నుమూశారు. ఆయనకు 81 ఏళ్ల వయస్సు.

షోలే, పురానా మందిర్, అందాజ్ అప్నా అప్నా వంటి సినిమాల్లో ఆయన పోషించిన పాత్రలను ప్రేక్షకులు మరిచిపోలేరు. బంద్రాలోని తన నివాసం బుధవారం రాత్రి 8.30 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు. వయస్సుకు సంబంధించిన ఇబ్బందులతో ఆయన బాధపడుతూ వస్తున్నారు. జగదీప్ కు భార్య, కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. నటుడు జావేద్ జాఫ్రీ, టీవీ పర్సనాలిటీ నవీద్ జాఫ్రీ ఆయన సంతానమే. 

 

షోలే సినిమాలో ఆయన పోషించిన సూర్మా భోపాలీ పాత్ర ఆయనకు మంచి పేరు తెచ్చి పెట్టింది. అందాజ్ అప్నా అప్నా లో సల్మాన్ ఖాన్ తండ్రిగా ఆయన నటించారు. జగదీప్ చివరి సినిమా గల్లీ గల్లీ చోర్ హై.  ఇందులో ఆయన పోలీసు కానిస్టేబుల్ పాత్రను పోషించారు. 

జగదీప్ మృతికి అజయ్ దేవగన్, మధుర్ భండార్కర్ తదితరులు సంతాపం ప్రకటించారు. బాలీవుడ్ ప్రముఖులు ఆయన మృతికి సంతాపం ప్రకటించారు.