సంక్రాంతి సీజన్ లో సినిమా రిలీజ్ చేస్తే కలెక్షన్స్ ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. టాక్ తో నిమిత్తం లేకుండా మినిమం ఓపినింగ్స్ వచ్చేస్తాయి. ముఖ్యంగా తెలుగు వాళ్లకు ఇష్టమైన ఫన్, యాక్షన్ ఉంటే చాలు థియోటర్స్ ఫుల్ అయ్యిపోతాయి. ఇవి దృష్టిలో పెట్టుకునే సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’, అల్లు అర్జున్ ‘అల వైకుంఠ‌పుర‌ములో’ సినిమాలు రిలీజ్ డేట్స్  ప్రకటించాయి. ఈ రెండు సినిమాలు జనవరి 12న రిలీజ్ అవుతున్నాయి.

అయితే ఊహించని విధంగా సురేష్ బాబు రంగంలోకి దిగి తన తమ్ముడు చిత్రం వెంకీ మామ ను సైతం సంక్రాంతికే వదులుతున్నట్లు కన్ఫర్మ్ చేసారు.  గత సంవత్సరం సైలెంట్ గా వచ్చి సంక్రాంతికి వెంకటేష్ చిత్రం ‘ఎఫ్ 2’ కలెక్షన్స్ మొత్తం ఎగరేసుకుపోయింది. మళ్లీ ఇప్పుడు అదే ఫీట్ రిపీట్ అవుతుందని వెంకటేష్ ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు.

అది ప్రక్కన పెడితే థియోటర్స్ పరంగా సురేష్ బాబు సొంత సినిమా సీన్ లో ఉంటే మిగతా సినిమాలకు ఇబ్బందులు తప్పవు. ఎందుకంటే రెండు రాష్ట్రాల్లో చాలా థియోటర్స్ ఆయన చేతిలో ఉన్నాయి. ఈ నేపధ్యంలో తన సొంత సినిమాకు థియోటర్స్ ఇచ్చుకుంటారు తప్ప, మిగతా వాళ్లకు  ప్రయారిటీ ఇవ్వరు. ఇది ఖచ్చితంగా ‘సరిలేరు నీకెవ్వరు’,‘అల వైకుంఠ‌పుర‌ములో’ల గ్రాండ్ రిలీజ్ లకు దెబ్బకొట్టేదే.

మరో ప్రక్క  ఈ సంక్రాంతి రేస్‌లో కళ్యాణ్ రామ్ ‘ఎంత‌మంచివాడ‌వురా’ కూడా ఉండనుందని టీజర్‌లో హింట్ ఇచ్చారు. అలానే తమిళ చిత్రం సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ మూవీ ‘ద‌ర్బార్’ కూడా సంక్రాంతినే టార్గెట్ చేసింది.  దాంతో కళ్యాణ్ రామ్ సినిమా, దర్బార్ కు థియోటర్స్ అసలు దొరుకుతాయా అనే సందేహం పట్టుకుంది. గత సంవత్సరం కూడా రజనీ సినిమా పేటకు థియోటర్స్ సమస్య వచ్చి రచ్చ రచ్చ అయ్యి రిలీజ్ అయ్యిన సంగతి తెలిసిందే.