వెంకటేష్, నాగచైతన్య కలిసి నటిస్తోన్న 'వెంకీ మామ' సినిమా సంక్రాంతి బరిలో దిగబోతుందని తెలియగానే ఇండస్ట్రీలో హడావిడి మొదలైంది. ఆ సినిమా డేట్ రాకముందే రెండు భారీ సినిమాలు డేట్స్ ప్రకటించేశాయి. కానీ ఇప్పుడేమో 'వెంకీ మామ' రిలీజ్ డేట్ విషయంలో ఆలోచనలో పడ్డట్లు సమాచారం. సంక్రాంతికి రావాలనే ఆలోచన ఆలస్యంగా వచ్చినందుకు థియేటర్ల కొరత ఏర్పడే అవకాశాలు ఉన్నాయి.

సురేష్ బాబు బ్యాకప్ ఉన్నా.. అటు పెద్ద సినిమాల రిలీజ్ కూడా ఉండడంతో ఆశించిన స్థాయిలో థియేటర్లు దొరికే పరిస్థితి కనిపించడం లేదు. ఉత్తారంధ్ర లాంటి ఏరియాలో సోలోగా వస్తే కనీసం వంద థియేటర్లలో సినిమా వేసే ఛాన్స్ ఉంటుంది. అలాంటిది ఇప్పుడు నలభై థియేటర్లు దొరకడం కష్టమనే మాటలు వినిపిస్తున్నాయి. దాదాపు అన్ని ఏరియాల్లో ఇదే పరిస్థితి ఉందని తెలుస్తోంది. 

ఇలాంటి నేపధ్యంలో ఎటూ తేల్చుకోలేకపోతుంది చిత్రబృందం. ఈ విషయానికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే ఆలోచనలో పడ్డాడు సురేష్ బాబు. ఏ విషయం రెండు రోజుల్లో చెబుతానని యూనిట్ కి సురేష్ బాబు చెప్పినట్లు తెలుస్తోంది. మరోపక్కన డిసంబర్ మూడో వారంలో కూడా వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. డిసంబర్ రెండో వారం నుండి జనవరి రెండో వారం మధ్య సరైన డేట్ చూసుకొని రిలీజ్ డేట్ అనౌన్స్ చేయాలని సురేష్ బాబు ఆలోచిస్తున్నాడు.

ప్రస్తుతం చెన్నైలో ఉన్న సురేష్ బాబు తిరిగి హైదరాబాద్ వచ్చాక కానీ సినిమా రిలీజ్ డేట్ మీద క్లారిటీ రాదు. అయితే పండక్కి ఇది సరైన సినిమా అనే చెప్పాలి. పల్లెటూరి బ్యాక్ డ్రాప్ తో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే విధంగా ఈ సినిమాను సిద్ధం చేశారు. ఇటీవల దసరా కానుకగా ఈ సినిమా ఫస్ట్ గ్లిoప్స్ రిలీజ్ చేశారు. తమన్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాలో రాశిఖన్నా, పాయల్ రాజ్ పుత్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.