రియల్ లైఫ్ మామా అల్లుళ్ళు విక్టరీ వెంకటేష్, నాగ చైతన్య కలసి నటిస్తున్న చిత్రం వెంకీ మామ. మూవీలో కూడా వీరిద్దరూ మామా అల్లుళ్లే. జైలవకుశ ఫేమ్ దర్శకుడు బాబీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంపై మంచి బజ్ నెలకొంది ఉంది. ఇటీవల విడుదలైన టీజర్ కు కూడా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. 

కానీ రిలీజ్ డేట్ విషయంలోనే చిత్ర యూనిట్ క్లారిటీ ఇవ్వలేదు. మొదట సంక్రాంతికి రిలీజ్ అవుతుందని ప్రచారం జరిగింది. ఆ తర్వాత క్రిస్టమస్ కి అంటూ ఊహాగానాలు వినిపించాయి. కానీ చిత్ర యూనిట్ మాత్రం స్పందించలేదు. ఎట్టకేలకు వెంకీ,మామ చిత్రం రిలీజ్ డేట్ ఖరారైంది. 

ఈ చిత్ర విడుదల తేదీని వెరైటీగా వీడియో రూపంలో ప్రకటించారు. రానా, దర్శకుడు బాబీతో ఫన్నీ వీడియోని రూపొందించారు. రానా జిమ్ లో వర్కౌట్ చేస్తుండగా వరుసగా మెసేజ్ లు వస్తుంటాయి. ఓపెన్ చేసి చూస్తూ వెంకీమామ రిలీజ్ డేట్ ఎప్పుడు అంటూ అభిమానులు రానాని ప్రశ్నిస్తుంటారు. 

వెంటనే రానా కారులో డైరెక్టర్ బాబీ దగ్గరకు వెళతాడు. బాబీ వెంకీమామ చిత్ర ట్రైలర్ కట్ లో బిజీగా ఉంటాడు. అక్కడ రానా, బాబీ మధ్య సరదా సంభాషణ జరుగుతుంది. ఏం జరుగుతోంది అని రానా ప్రశ్నించగా.. ట్రైలర్ ఫైనల్ కట్ బ్రో.. అదిరిపోయింది అని బాబీ బదులిస్తాడు. టీజర్స్, సాంగ్స్ కాదు బ్రో.. రిలీజ్ డేట్ చెప్పు.. సోషల్ మీడియాలో వాయించేస్తున్నారు. చిన్నానని, చైతుని వెండితెరపై చూడాలని నేను కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నా అని రానా అంటాడు. 

దీనితో బాబీ కాసేపు ఆలోచించుకుని రానాకు చెవిలో రిలీజ్ డేట్ చెబుతాడు. ఇలా వెంకీ మామ చిత్రాన్ని డిసెంబర్ 13న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. 

ఈ చిత్రంలో వెంకటేష్ కు జోడీగా హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్, చైతుకు హీరోయిన్ గా రాశి ఖన్నా నటిస్తున్నారు. సురేష్ బాబు నిర్మాత. తమన్ సంగీతం అందిస్తున్నాడు.