ధనుష్ నటించిన అసురన్ చిత్రం తమిళంలో ఎంతటి ఘనవిజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మొరటుగా కనిపించే పల్లెటూరి వ్యక్తి పాత్రలో ధనుష్ అద్భుతంగా నటించాడు. ఈ చిత్ర తెలుగు రీమేక్ హక్కులని ప్రముఖ నిర్మాత సురేష్ బాబు సొంతం చేసుకున్నారు. విక్టరీ వెంకటేష్ హీరోగా, శ్రీకాంత్ అడ్డాల దర్శత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది అని ప్రకటించినప్పుడు అభిమానుల్లో చిన్నపాటి అనుమానం. 

సాఫ్ట్ సినిమాలు చేసే శ్రీకాంత్ అసురన్ రీమేక్ ని హ్యాండిల్ చేయగలడా అని అంతా చర్చించుకున్నారు. కానీ తాజాగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ద్వారా అనుమానాలన్నీ పటాపంచలు అయ్యాయి. ఫస్ట్ లుక్ పోస్టర్స్ లో శ్రీకాంత్ అడ్డాల వెంకటేష్ ని ఊర మాస్ లుక్ లో ప్రజెంట్ చేసిన విధానం అదుర్స్. 

రఫ్ లుక్ లో వెంకీ భయంకరంగా కనిపిస్తున్నాడు. ఈ చిత్రానికి నారప్ప అనే టైటిల్ ఫిక్స్ చేశారు. తమిళంలో ధనుష్ తరహాలోనే వెంకటేష్ తలపాగా, పంచె కట్టులో కనిపిస్తున్నాడు. వెంకటేష్ ఇంటెన్స్ లుక్, కత్తి పట్టుకుని వస్తున్న విధానం ఒక రేంజ్ లో ఉంది. వెంకటేష్ కళ్ళు, గడ్డంని హైలైట్ చేసేలా ఒక పోస్టర్, కత్తి పట్టుకుని నడచివస్తున్న మరో పోస్టర్, దీనంగా ఆకాశం వంక చూస్తున్న పోస్టర్స్ తో ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. 

ఫస్ట్ లుక్ తోనే సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయని చెప్పొచ్చు. సురేష్ బాబు, తమిళంలో అసురన్ చిత్రాన్ని నిర్మించిన ఎస్ థాను సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చాలా కాలం తర్వాత వెంకటేష్ ఇలా పూర్తి స్థాయి మాస్ లుక్ లో అభిమానులు చూస్తున్నారు.