మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ తన కో యాక్టర్ సాయి పల్లవి, నటి తమన్నాలకు ఓ ఛాలెంజ్ విసిరారు. అది మొక్కలు నాటే ఛాలెంజ్. తెలంగాణా రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ ఎంపీ అయిన జోగినపల్లి సంతోష్ కుమార్ రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంచాలనే లక్ష్యంతో గ్రీన్ ఛాలెంజ్ పేరిట ఒక కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో 
భాగంగా చాలా మంది రాజకీయనాయకులు, సామాన్యులు, సెలబ్రిటీలు మొక్కలు నాటారు.

‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ పేరుతో ఎంపీ సంతోష్ కొంతమంది సెలబ్రిటీలకు ఛాలెంజ్ విసిరారు. అందులో అఖిల్ అక్కినేని కూడా ఉన్నారు. ఆ ఛాలెంజ్ స్వీకరించిన అఖిల్ తను మొక్కలు నాటి ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను సోదరుడు నాగచైతన్య, వరుణ్ తేజ్ కి విసిరారు.

అఖిల్ ఇచ్చిన ఛాలెంజ్ ని పూర్తి చేసిన వరుణ్ ట్విట్టర్ ద్వారా స్పందించి ఓ పోస్ట్ పెట్టాడు. తనను నామినేట్ చేసినందుకు ఎంపీ సంతోష్ గారికి, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసిరిన అఖిల్ అక్కినేనికి కృతజ్ఞతలు చెప్పిన వరుణ్ తేజ్.. తను బిజీగా ఉన్నప్పటికీ ఓ మంచి పని చేయడానికి ఆలస్యం చేయకూడదని అన్నారు.

ఈ మంచి పని చేయడానికి తను సాయి పల్లవి, తమన్నాను నామినేట్ చేస్తున్నట్లు చెప్పారు. మరి వరుణ్ ఛాలెంజ్ ని ఈ బ్యూటీస్ స్వీకరిస్తారో లేదో చూడాలి. సినిమాల  విషయానికొస్తే.. ఇటీవల వరుణ్ నటించిన 'గద్దలకొండ గణేష్' సినిమా పెద్ద సక్సెస్ అందుకుంది. ప్రస్తుతం వరుణ్ తన తదుపరి సినిమా కోసం సిద్ధమవుతున్నాడు.