వరలక్ష్మీ శరత్ కుమార్ నటిగా ఎంత మంచి గుర్తింపు తెచ్చుకున్నారో.. ఫైర్ బ్రాండ్ లేడీగా కూడా గుర్తింపు పొందారు. తమిళ సినియర్ నటుడు శరత్ కుమార్ ముద్దుల కుమార్తె వరలక్ష్మి. హీరోయిన్ పాత్రలతో మాత్రమే కాకుండా విలన్, క్యారెక్టర్ రోల్స్ తో సైతం వరలక్ష్మి దూసుకుపోతోంది. 

ఆ మధ్యన వరలక్ష్మి ఇలయథలపతి విజయ్ సర్కార్ చిత్రంలో లేడీ విలన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఆయా చిత్రంలో వరలక్ష్మి నటనకు ప్రశంసలు దక్కాయి. వరలక్ష్మి సామజిక అంశాల గురించి కూడా ప్రస్తావిస్తూ ఉంటుంది. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావంతో లాక్ డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. 

 

ఇలాంటి తరుణంలో వరలక్ష్మీ ఓ ఆసక్తికర విషయాన్ని  తెరపైకి తీసుకువచ్చింది. లాక్ డౌన్ కారణంగా మహిళలు ఇంట్లోనే ఉంటున్నారు. ఇలాంటి సమయంలో మహిళలు వేధింపులకు, గృహహింసకు గురయ్యే అవకాశం ఉందని వరలక్ష్మీ తెలిపింది. 

అలా వేధింపులకు గురవుతున్న మహిళల్ని కాపాడాల్సిన భాద్యత మనదే. కాబట్టి మీకు తెలిసిన వారు ఎవరైనా వేధింపులకు గురవుతూ ఉంటే వారికి 1800 102 7282 నంబరు షేర్ చేయాలని కోరింది. వేధింపులకు వయసు, ఆస్థి, స్థాయితో సంబంధం లేదు. ఎక్కడయినా వేధింపులు జరగొచ్చు. దయచేసి అలాంటి వారిని కాపాడుకుందాం అంటూ వరలక్ష్మీ పిలుపునిచ్చింది.