నితిన్ ప్రస్తుతం వెంకీకుడుముల దర్శత్వంలో భీష్మ చిత్రంలో నటిస్తున్నాడు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. కథ విషయంలో పూర్తిగా సంతృప్తి చెందితేనే దర్శకులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. భీష్మ తర్వాత నితిన్ చంద్రశేఖర్ యేలేటి దర్శత్వంలో, తొలిప్రేమ ఫేమ్ వెంకీ అట్లూరి దర్శత్వంలో నితిన్ నటించాల్సి ఉంది. 

ఇదిలా ఉండగా నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి బాలీవుడ్ లో ఘనవిజయం సాధించిన అంధదున్ చిత్ర రీమేక్ హక్కులని దక్కించుకున్నారు. తెలుగు రీమేక్ లో నితిన్ హీరోగా నటించనున్నాడు. ప్రస్తుతం చిత్రాన్ని తెరకెక్కించగల సరైన దర్శకుడి కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. 

ఈ క్రమంలో స్వామిరారా ఫేమ్ సుధీర్ వర్మతో సుధాకర్ రెడ్డి సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అంధదున్ తెలుగు రీమేక్ దర్శకుడిగా సుధీర్ వర్మ దాదాపుగా ఖాయమైనట్లు వార్తలు వస్తున్నాయి. 

బాలీవుడ్ లో అంధదున్ చిత్రంలో ఆయుష్మాన్ ఖురానా, టబు ప్రధాన పాత్రల్లో నటించారు. శ్రీరామ్ రాఘవన్ దర్శత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో వసూళ్లు కొల్లగొట్టింది. 

స్వామిరారా చిత్రంతో మంచి విజయం సొంతం చేసుకున్న సుధీర్ వర్మ టాలీవుడ్ దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత సుధీర్ వర్మ తెరకెక్కించిన దోచెయ్, కేశవ, రణరంగం లాంటి చిత్రాలు నిరాశపరిచాయి. 

మరోవైపు నితిన్ తన భీష్మ చిత్రాన్ని 2020 ఫిబ్రవరి 21న రిలీజ్ చేయనున్నాడు. వాస్తవానికి ఈ చిత్రం డిసెంబర్ లోనే రావాల్సింది. కానీ వాయిదా పడింది.