కరోనా మహమ్మారి ప్రపంచాన్ని చుట్టేస్తోంది. ఈ మహమ్మారి ప్రభావంతో 200 దేశాలు విలవిలలాడుతున్నాయి. క్షణక్షణానికి వైరస్ సోకిన ప్రజలు సంఖ్య భారీగా పెరుగుతుండటంతో అగ్రదేశాలు సైతం వణికిపోతున్నాయి. ఈ నేపథ్యంలో సెలబ్రిటీలు కూడా ఇళ్లకే పరిమితమయ్యారు. ఎప్పుడు బిజినెస్‌లు, మీటింగ్‌లతో బిజీగా ఉండే వారికి కాస్త ఖాళీ సమయం దొరకటంతో కుటుంబ సభ్యులతో పాటు తమ పెంపుడు జంతువులతో సరదాగా కాలం గడుపుతున్నారు.

తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కూడా ఇలాంటి పోస్ట్ చేసింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌ గా ఉండే ఉపాసన తన అభిప్రాయలను ఎప్పటికప్పుడూ ఫాలోవర్స్ తో షేర్ చేసుకోవటంతో పాటు వారికి కావాల్సిన సూచనలు సలహాలు ఇస్తుంటుంది. ప్రస్తుతం కరోనా లాక్‌ డౌన్‌ కారణంగా ఉపాసన కూడా ఇంటికే పరిమితమైంది. తాజాగా ఆమె చేసిన ఓ ట్వీట్ ఆసక్తికరంగా మారింది.

ఉపాసన జంతు ప్రేమికురాలు అన్న సంగతి తెలిసిందే. అయితే కరోనా భయంతో చాలా మంది జంతువులను దగ్గరకు తీసుకోవడానికి భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె అలాంటి వారి కోసం ఓ సందేశం ఇచ్చారు. `కరోనా విజృంభిస్తున్న ఈ సమయంలో చాలా మంది జంతువులను నిర్లక్ష్యం చేస్తున్నారు, కొంత మంది వాటి పట్ల దారుణంగా వ్యవహరిస్తున్నారు` అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు కరోనా జంతువుల కారణంగా రాదని చెప్పారు ఉపాసన.

తన ట్విట్టర్ పేజ్‌లో పెంపుడు గుర్రంతో కలిసి దిగిన ఫోటోలను పోస్ట్ చేసి ఉపాసన ` సెల్ఫ్ క్వారెంటైన్‌లో ఉన్నా నా డార్లింగ్ డేయిసీకి (ఆమె గుర్రం) దూరంగా ఉండటం లేదు. జంతువుల పట్ల ప్రేమ, వాటి సంరక్షణ చూసుకోవాల్సిన సమయం ఇదే. కొంత మంది క్రూరులు ఈ లాక్‌ డౌన్ టైంలో జంతువులను పట్టించుకోవటం లేదు. మీ పెంపుడు జంతువుల పట్ల మీరు చూపించే ప్రేమ వీ వ్యక్తిత్వం ఏంటో చూపిస్తోంది` అని కామెంట్ చేసింది.