మెగాస్టార్ చిరంజీవి నటించిన 'సైరా నరసింహారెడ్డి' సినిమా గాంధీజయంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ దక్కించుకుంది. ఈ సినిమాకి అన్ని భాషల ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాలో నటి తమన్నా.. లక్ష్మీ నరసింహారెడ్డి అనే పాత్ర పోషించింది.

ఈ పాత్రకి ప్రేక్షకుల నుండి మంచి అప్లాజ్ వస్తోంది. చాలా మంది తమన్నాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తమన్నా నూటికి నూరు శాతం తన పాత్రకు న్యాయం చేసిందని ఆమె పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు. నిన్న జరిగిన సినిమా థాంక్స్ మీట్ లో కూడా చిరంజీవి, రామ్ చరణ్.. తమన్నాకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పారు.

ఈ సినిమా సక్సెస్ ని మెగా కాంపౌండ్ బాగా ఎంజాయ్ చేస్తోంది. నిర్మాత రామ్ చరణ్ భార్య ఉపాసన కూడా తన సంతోషాన్ని ట్విట్టర్ వేదికగా షేర్ చేస్తున్నారు. తాజాగా ఉపాసన  తనదైన శైలిలో తమన్నాకి అభినందనలు తెలిపారు. అధ్బుతంగా నటించి మెప్పించిన తమన్నాకు ఆమె ప్రత్యేక బహుమతి అందించారు. 

ఖరీదైన డైమండ్ రింగ్ ని తమన్నాకి గిఫ్ట్ గా ఇచ్చింది ఉపాసన. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. ''నిర్మాత భార్య నుంచి సూపర్ తమన్నాకు ఓ బహుమతి. నిన్ను మిస్ అవుతున్నాను. త్వరలో కలుద్దాం'' అంటూ రాసుకొచ్చింది.

ఆ రింగ్ తో తమన్నా తీసుకున్న ఫోటోని కూడా షేర్ చేసింది. ఇది చూసిన అభిమానులు తమన్నా ఆ బహుమతికి అర్హురాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి 'సైరా' ఇచ్చిన సక్సెస్ తమన్నా కెరీర్ కి పెద్ద బూస్టప్ అనే చెప్పాలి. మరి ఈమెకి టాలీవుడ్ లో అవకాశాలు పెరుగుతాయేమో చూడాలి!