ఎందరో సినిమా సెలెబ్రిటీల జీవితాలు విషాదాంతంగా ముగిసిన సందర్భాలు ఉన్నాయి. హాలీవుడ్ లో ఇలాంటి సంఘటనలు ఎక్కువ. డిప్రెషన్ కారణంగా వ్యసనాలకు బానిసై చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోయినవారు ఎందరో ఉన్నారు. 

తాజాగా మరో యువనటుడు, అతడి ప్రేయసి ప్రాణాలు కోల్పోయారు. ట్విలైట్ చిత్రంతో గుర్తింపు సొంతం చేసుకున్న గ్రెగొరీ టైరీ బోయ్స్(30), అతడిప్రేయసి నటాలీ అడెపోజు(27) అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందారు. లాస్ ‌వెగాస్‌లోని గ్రెగొరీ టైరీ బోయ్స్ నివాసంలో వీరిద్దరి మృతదేహాలను పోలీసులు గుర్తించారు. వీరిద్దరిది ఆత్మహత్య లేక హత్య అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

ప్రాధమిక దర్యాప్తు మేరకు ఘటనాస్థలంలో తెల్లటి పౌడర్ లాంటి పదార్థం కనిపించినట్లు పోలీసులు పేర్కొన్నారు. అలాగే హత్య జరిగినట్లుగా ఎలాంటి ఆధారాలు, పరిస్థితులు అక్కడ లేవని.. ఆత్మహత్య అయి ఉండొచ్చని పోలీసులు అంటున్నారు. 

బోయ్స్ కి ఇప్పటికే 10 ఏళ్ల కుమార్తె ఉంది. నటాలీకి ఓ కొడుకు ఉన్నాడు. వీరిద్దరూ ఏడాది కాలంగా సహజీవనం చేస్తున్నారు. వీరిద్దరి మృతికి కారణాలు కుటుంబ సభ్యులకు కూడా అంతుచిక్కడం లేదు. బోయ్స్ తల్లి తన కొడుకు మృతితో తల్లడిల్లిపోతోంది. బోయ్స్.. నన్ను ఎందుకు వదిలివెళ్ళావు అంటూ రోదిస్తోంది. 

బోయ్స్ కు లాస్ ఏంజిల్స్ లో అనేక వ్యాపారాలు ఉన్నాయి. నటాలీ బోయ్స్ కు వ్యాపారంలో సాయం చేస్తూ ఉండేది. అలా వీరిమధ్య పరిచయం పెరిగింది. వ్యాపారాలు చూసుకుంటూనే బోయ్స్ నటనపై కూడా దృష్టి పెట్టాడు. షూటింగ్స్ లేని సమయంలో లాస్ వేగాస్ వెళ్లి తన తల్లికి సాయం చేసేవాడు. ట్విలైట్ చిత్ర యూనిట్ బోయ్స్ మృతికి సంతాపం తెలియజేస్తోంది.