టాలీవుడ్ లోని స్టార్స్ అందరితో దిల్ రాజు సినిమాలు చేశారు. కానీ పవన్, దిల్ రాజు కాంబోలో ఇంతవరకు మూవీ రాలేదు. ఈ కాంబినేషన్ కోసం దిల్ రాజు ఏళ్ల తరబడి ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు పవన్ తో సినిమా చేసే   అవకాశాన్ని దిల్ రాజు దక్కించుకున్నారు. 

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ నటించిన పింక్ మూవీ హిందీలో ఘనవిజయం సాధించింది. ఈ చిత్ర తమిళ రీమేక్ లో క్రేజీ హీరో అజిత్ నటించగా అక్కడ కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు తెలుగు వంతు వచ్చింది. పింక్ తెలుగు రీమేక్ కు పవన్ కళ్యాణ్ పర్ఫెక్ట్ ఛాయిస్ అని భావిస్తున్నారు. 

వేణు శ్రీరామ్ ఈ చిత్రానికి దర్శకుడు. ఇదిలా ఉండగా మొదట క్రిష్ దర్శకత్వంలో పవన్ రీ ఎంట్రీ చిత్రం ఉంటుందని భావించారు. కానీ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ జోక్యంతో పవన్ పింక్ రీమేక్ కు కమిటయ్యాడట. పవన్ కళ్యాణ్ ని దిల్ రాజు కలిసే ఏర్పాటు చేసింది త్రివిక్రమే అని ఇండస్ట్రీలో టాక్. 

మరో ఆసక్తికర విషయం ఏంటంటే పింక్ కథని త్రివిక్రమ్ శ్రీనివాస్ తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా మార్పులు చేస్తున్నారట. ఈ చిత్రంలో ఆయన కొంత వాటా కూడా పొందనునట్లు ప్రచారం జరుగుతోంది. 

పింక్ రీమేక్ చిత్రానికి గాను పవన్ కేవలం 25 రోజుల కాల్ షీట్స్ మాత్రమే కేటాయించినట్లు తెలుస్తోంది. 25 రోజుల షూటింగ్ కోసం పవన్ కళ్యాణ్ 40 కోట్ల రెమ్యునరేషన్ ఆదుకోనున్నారట. పింక్ రీమేక్ తర్వాత పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.