సాధారణంగా సినిమాలు మంచి మంచి లోకేషన్లలో తీస్తారు. అలా కుదరని పక్షంలో స్టూడియోలలో సెట్స్‌ వేసి తీస్తారు. అది కూడా కుదరని పక్షంలో గ్రీన్‌ మాట్‌లో చిత్రీకరించి వాళ్లకు కావాల్సినట్టుగా గ్రాఫిక్స్‌లో వాతావరణాన్ని క్రియేట్ చేసుకుంటారు. కానీ ఇప్పుడు ఓ హాలీవుడ్‌ హీరో అరుదైన రికార్డ్‌ను తన ఖాతాలో వేసుకోబోతున్నాడు. గతంలో ఎవరూ చేయని విధంగా ఏకంగా అంతరిక్షంలో సినిమా షూటింగ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా చకచకా జరిగిపోతున్నాయి.

హాలీవుడ్‌లో యాక్షన్‌ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన నటుడు టామ్‌ క్రూజ్‌. ఈ హాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ తాజాగా అంతరిక్షంలో ఓ సినిమా షూటింగ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. టామ్‌, అమెరికన్‌ స్పేస్‌ ఏజెన్సీ నాసాతో కలిసి ఓ సినిమా చేస్తున్నాడు. ఈ విషయాన్ని 'నాసా' అడ్మినిస్ట్రేటర్‌ జిమ్‌ బ్రైడెన్‌స్టీన్‌ కూడా ధృవీకరించారు. 

`టామ్‌ క్రూజ్‌తో కలిసి నాసా స్పేస్‌ స్టేషన్‌లో ఓ మూవీ కోసం పని చేయడానికి మా సంస్థ ఆసక్తిగా ఎదురుచూస్తుంది`  అంటూ బ్రైడెన్‌స్టీన్‌ ట్వీట్‌ చేశారు. యాక్షన్‌ అడ్వెంచరస్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాకి స్పేస్‌ ఎక్స్‌ అనే సంస్థ సహాయం చేస్తోంది. ఈ సంస్థ  స్పేస్‌లోకి పంపే రాకెట్స్‌ తయారుచేస్తుంది. ఈ సినిమాతో అంతరిక్షంలో షూట్ చేసిన తొలి  హీరోగా టాక్‌ క్రూజ్‌ రికార్డ్‌ సృష్టించనున్నాడు. అయితే ఈ విషయం కరోనా కారణంగా అంతరిక్షంలో షూటింగ్ అంటూ ఫన్నీగా కామెంట్‌ చేస్తున్నారు నెటిజన్లు.