ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్ ని పోలీసులు కొద్దిసేపటి క్రితమే అరెస్ట్ చేశారు. పోలీసులు అతడిని జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ముంబైకి చెందిన ఓ ఫైనాన్షియర్ ని మోసం చేసిన కేసులో బండ్ల గణేష్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. 

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన బండ్ల గణేష్ ఆ తర్వాత నిర్మాతగా అడుగుపెట్టాడు. ఆరంభంలో పరాజయాలు ఎదుర్కొన్నప్పటికీ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ చిత్రంతో గణేష్ దశ తిరిగింది. గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో గణేష్ క్రేజీ నిర్మాతగా మారిపోయాడు. 

ఆ తర్వాత గణేష్ టెంపర్, బాద్షా, గోవిందుడు అందరి వాడేలే లాంటి విజయవంతమైన చిత్రాలని నిర్మించాడు. ఆ తర్వాత నిర్మాతగా గణేష్ కొంత బ్రేక్ తీసుకున్నాడు. కానీ రాజకీయ పరమైన సంచలన వ్యాఖ్యలు, కొన్ని వివాదాలతో గణేష్ వార్తల్లో ఉంటూ వచ్చాడు. 

గణేష్ ఆర్థిక వ్యవహారాల గురించి గతంలో అనేక ఆరోపణలు ఎదురయ్యాయి. తాజాగా బండ్ల గణేష్ ముంబైకి చెందిన ఓ ఫైనాన్షియర్ తో ఆర్థిక లావాదేవీలు జరిపినట్లు తెలుస్తోంది. అతడిని చీట్ చేసిన కేసులో జూబ్లీ హిల్స్ పోలీసులు గణేష్ ని అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి.