కరోనా పోరాటంలో ప్రజలనందరినీ ఒక్క తాటి మీదకు తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలు ప్రయత్నిస్తోంది. జనతా కర్ఫ్యూ సందర్భంగా వైధ్య, పోలీసుల, శానిటేషన్ సిబ్బందికి సంఘీభావంగా చప్పట్లు కొట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుకు దేశ ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. తాజాగా లాక్‌ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రధాని మరో పిలుపునిచ్చారు.

ఈ ఆదివారం (5-4-2020) రాత్రి 9 గంటల నుంచి 9 నిమిషాల పాటు దేశంలోని ప్రజలంతా ఇంట్లో లైట్లు ఆపేసి తమ ఇంటి బాల్కనీలో దీపాలు, టార్చ్‌ లైట్లు, సెల్‌ ఫోన్‌ లైట్లు వెలిగించి ఐక్యతను చాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమలంతో ప్రతీ ఒక్కరిలోనూ కరోనా పోరాడే ధైర్యం మనకు ఉందని, మనం ఒంటరికాదని అందరికీ తెలియజేయాలని కోరాడు.

అయితే మోదీ పిలుపుకు ఇప్పటికే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్‌, వైఎస్‌ జగన్‌లు మద్దతు తెలుపగా సినీ తారలు కూడా తమ అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. ఈ మేరకు మెగాస్టార్‌ చిరంజీవి, కింగ్ నాగార్జున, మెగా పవర్‌ స్టార్ రామ్ చరణ్ లు వీడియో సందేశాలు విడుదల చేశారు. వీరితో పాటు మరికొంత మంది సినీ తారలు ఇతర ప్రముఖులు మోడీ పిలుపుకు మద్ధతుగా సోషల్ మీడియాలో పోస్ట్ లు చేస్తున్నారు.