నటీమణులు వీలైనంత ఎక్కువ కాలం చిత్ర పరిశ్రమలో హీరోయిన్లుగా రాణించాలని భావిస్తారు. కానీ స్టార్ గా ఎదిగే అవకాశం, ఎక్కువ చిత్రాల్లో నటించే అవకాశం అందరికి దక్కదు. హీరోయిన్ గా రాణించాలంటే అందం, అభినయంతో పాటు ఎంతోకొంత అదృష్టం కూడా ఉండాలి. అదృష్టం లేకపోతే స్టార్స్ గా ఎదగడం కష్టం. 

కొంతమంది హీరోయిన్లు చిన్న చిత్రాల్లో నటించి ఆ తర్వాత కెరీర్ కు ఫుల్ స్టాప్ పెడుతుంటారు. అదే బాటలో హీరోయిన్ మనాలి రాథోడ్ పయనించింది. ఎలాంటి హడావిడి లేకుండా ఆమె పెళ్లి చేసేసుకుంది. మనాలి రాథోడ్ వివాహానికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. విజిత్ వర్మ అనే వ్యాపారవేత్తని ఆమె పెళ్లి చేసుకుంది. 

ఈ వివాహ వేడుకలో టాలీవుడ్ సెలెబ్రటీలు కొందరు సందడి చేశారు. రాజశేఖర్ దంపతులు, నటి హేమ, దర్శకుడు క్రిష్ లాంటి సెలెబ్రిటీలంతా మనాలి రాథోడ్ పెళ్ళిలో మెరిశారు. నవ వధూవరులు ఇద్దరూ సాంప్రదాయ వస్త్రధారణలో మెరిసిపోతున్నారు. 

తెలుగులో మనాలి రాథోడ్ వంశి దర్శకత్వంలో ఫ్యాషన్ డిజైనర్ చిత్రంలో నటించింది. ఓస్త్రీ రేపురా, గ్రీన్ సిగ్నల్ లాంటి చిత్రాల్లో నటించింది. కొన్ని తమిళ చిత్రాల్లో కూడా నటించింది. ప్రస్తుతం మనాలికి సరైన అవకాశాలు రాకపోవడంతో వివాహం చేసుకుని కెరీర్ కు ఫుల్ స్టాప్ పెట్టింది.