ప్రభాస్ తో తెరకెక్కించిన బిల్లా చిత్రం మెహర్ రమేష్ కు మంచి గుర్తింపు తీసుకువచ్చింది. ఆ తర్వాత మెహర్ రమేష్ తనకు వచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకోలేకపోయాడు ముఖ్యంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మెహర్ రమేష్ రెండు చిత్రాలు తెరకెక్కించాడు. వీరిద్దరి కాంబోలో కంత్రి, శక్తి చిత్రాలు వచ్చాయి. 

భారీ బడ్జెట్ లో తెరకెక్కిన శక్తి చిత్రం నిర్మాతకు భారీ నష్టాలు మిగిల్చింది. మెహర్ రమేష్ చివరగా తెరకెక్కించిన షాడో మూవీ కూడా డిజాస్టర్ గా మిగిలిపోయింది. ప్రస్తుతం మెహర్ రమేష్ చేతిలో ఎలాంటి చిత్రాలు లేవు. దీనితో ఈ దర్శకుడు డిస్ట్రిబ్యూటర్ గా కొత్త అవతారం ఎత్తాడు. 

తాజా సమాచారం మేరకు సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు చిత్ర డిస్ట్రిబ్యూషన్ హక్కులు మెహర్ రమేష్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. మెహర్ రమేష్ మహేష్ బాబుతో సన్నిహితంగా ఉంటాడు. 

మహేష్ సిఫారసుతో దిల్ రాజు మెహర్ రమేష్ కు గుంటూరు ఏరియా హక్కులు ఇచ్చినట్లు తెలుస్తోంది. మంచి ధరకే మెహర్ రమేష్ పంపిణీ హక్కులు సొంతం చేసుకున్నారట.  

2004లో మెహర్ రమేష్ కన్నడ చిత్రం 'వీర కన్నడిగ'తో దర్శకుడిగా పరిచయమయ్యాడు. సరిలేరు నీకెవ్వరు చిత్రం అనిల్ రావిపూడి దర్శత్వంలో తెరకెక్కుతోంది. లేడీ అమితాబ్ విజయశాంతి ఈ చిత్రంతో వెండితెరపైకి రీఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. అనిల్ సుంకర, దిల్ రాజు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రష్మిక మందన తొలిసారి మహేష్ కు హీరోయిన్ గా నటిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు సన్నాహకాలు జరుగుతున్నాయి.