దిగ్గజ బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మృతితో దేశం మొత్తం సినీ అభిమానులు విషాదంలో మునిగిపోయారు.  సినీ ప్రముఖులు ఒక్కొక్కరుగా ఇర్ఫాన్ మృతికి సంతాపం తెలియజేస్తున్నారు. తెలుగులో ఇర్ఫాన్ నటించింది సైనికుడు చిత్రంలో మాత్రమే. అయినప్పటికీ ఇర్ఫాన్ ఖాన్ ఇండియాలో మాత్రమే కాదు.. ప్రపంచం మొత్తం గుర్తింపు సొంతం చేసుకున్నారు. 

టాలీవుడ్ సినీ ప్రముఖులు మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, రాజశేఖర్, దర్శకుడు క్రిష్, హరీష్ శంకర్ లాంటి ప్రముఖులంతా ఇర్ఫాన్ ఖాన్ మృతికి సంతాపం తెలియజేశారు. 

ఇర్ఫాన్ ఖాన్ మరణించారనే ఘోరమైన వార్త విని చాలా బాధపడ్డా. ఇర్ఫాన్ ఖాన్ అద్భుతమైన నటుడు కాబట్టే ప్రపంచం మొత్తం గుర్తింపు సొంతం చేసుకున్నారు. ఇర్ఫాన్ స్థానం భర్తీ చేయలేనిది. అతడి నటన మన హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోతుంది. డియర్ ఇర్ఫాన్ నిన్ను ఎప్పటికీ గుర్తుంచుకుంటాం. నీ ఆత్మకు శాంతి  చేకూరాలి అని చిరంజీవి ట్వీట్ చేశారు. 

ఇర్ఫాన్ మరణం ప్రపంచ సినిమాకు తీరని లోటు. ఆయన కలసి నటించే అవకాశం నాకు దక్కలేదు. కానీ ఆయన సినిమాలని చూశా. అద్భుతమైన నటుడు. ఇర్ఫాన్ ఆత్మకు శాంతి చేకూరాలి అని విక్టరీ వెంకటేష్ పేర్కొన్నారు. 

నమ్మలేని, గుండె బద్దలయ్యే వార్త ఇది. ఇర్ఫాన్ ఖాన్ లా మరొక నటుడిని మనం చూడలేం. మీరు ఒక రత్నం సర్.. రెస్ట్ ఇన్ పీస్ అని హీరో రాజశేఖర్ ట్వీట్ చేశారు. 

అదేవిధంగా దర్శకులు క్రిష్, హరీష్ శంకర్ కూడా ఇర్ఫాన్ మృతికి సంతాపం తెలిపారు.