ఈ చిత్రానికి 'They Call Him OG’అని ఫిక్స్ చేయటంతో పవన్‌ ఫ్యాన్స్‌ మాత్రం తెగ ఖుషీ అవుతున్నారు.


యంగ్ డైరక్టర్ సుజీత్‌ దర్శకత్వంలో పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) ఓ సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ‘సాహో’ తర్వాత నాలుగేళ్ల గ్యాప్‌ తీసుకున్న సుజీత్‌.. పవన్‌తో పవర్‌ఫుల్‌ యాక్షన్‌ డ్రామాగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమా వర్కింగ్‌ టైటిల్‌గా ‘ఓజీ’ (OG) (ఒరిజినల్ గ్యాంగ్ స్టర్) అని పిలుస్తున్నారు. అయితే.. తాజాగా ఇదే సినిమా టైటిల్‌ అని రీసెంట్ గా ప్రొడక్షన్ హౌస్ పేర్కొంది. ఈ నేపధ్యంలో చిత్రం ఫస్ట్ లుక్ ఎప్పుడు వస్తుందనేది ఆసక్తికరమైన విషయంగా మారింది.

మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు..ఈ సినిమా ఫస్ట్ లుక్ ...పవన్ కళ్యాణ్ పుట్టిన రోజైన సెప్టెంబర్ 2 న విడుదల చేయటానికి నిర్ణయించారని తెలుస్తోంది. అయితే ఆ రోజు కేవలం ఫస్ట్ లుక్ పోస్టర్ మాత్రమే కాకుండా గ్లింప్స్ కూడా వచ్చే అవకాసం ఉందని తెలుస్తోంది. ఈ మేరకు టీమ్ ఏర్పాట్లు చేస్తున్నట్లు వినికిడి. అలాగే దీని ట్రైలర్‌ను ఆగస్టు 15న విడుదల చేయాలని మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నట్లు సమాచారం. 

ఇక ఈ చిత్రానికి 'They Call Him OG’అని ఫిక్స్ చేయటంతో పవన్‌ ఫ్యాన్స్‌ మాత్రం తెగ ఖుషీ అవుతున్నారు. ఇంత పవర్‌ఫుల్‌ టైటిల్‌ పవన్‌కు మాత్రమే సరిపోతుందంటూ కామెంట్స్‌ పెడుతున్నారు. ఈ సినిమాలో ఆయన గ్యాంగ్‌స్టర్‌ పాత్రలో కనిపించనున్నారు. ఇక ఈ మూవీని ప్రకటించిన నాటి నుంచే వరుస అప్‌డేట్‌లతో చిత్రటీమ్ ఎప్పుడూ సందడి చేస్తూనే ఉంది. ఈ భారీ ప్రాజెక్టులో బాలీవుడ్‌ స్టార్‌ హీరో అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh Bachchan) నటిస్తున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

ఈ చిత్రంలో పవన్‌కల్యాణ్‌కు జోడీగా ప్రియాంక అరుళ్‌ మోహన్‌ (Priyanka Arul Mohan) నటించనుంది. తమన్‌ సంగీతం అందిస్తున్నారు. ఇక దీనితో పాటు హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’, క్రిష్‌ డైరెక్షన్‌లో ‘హరిహర వీరమల్లు’లోనూ పవన్‌ నటిస్తున్నారు.