కోలీవుడ్ స్టార్ హీరో సూర్యను వరుస వివాదాలు వెంటాడుతున్నాయి. సూర్య సతీమణి, హీరోయిన్‌ జ్యోతిక గతంలో చేసిన కొన్ని వ్యాఖ్యలు ఈ జంటను ఇబ్బందుల్లో పడేశాయి. మనం ఆలయాల కన్నా ముందు స్కూల్స్‌, హాస్పిటల్స్‌ బాగుచేసుకోవాలన్న జ్యోతిక కామెంట్స్ లాక్‌ డౌన్‌ సమయంలో ట్రెండ్ కావటంతో ఆమె మీద తీవ్ర స్థాయిలో విమర్శలు వినిపించాయి. అయితే ఈ విషయంలో సూర్య జ్యోతికకు మద్దతుగా నిలబడటంతో ఆయన మీద కూడా విమర్శలు వచ్చాయి.

ఇక నిర్మాతగా కూడా సూర్యను సమస్యలు వెంటాడుతున్నాయి. లాక్‌ డౌన్ కారణంగా సినీ పరిశ్రమ కార్యకలాపాలు పూర్తి స్థాయిలో స్పంబించిపోయాయి. దీంతో పలువురు నిర్మాతలు తమ సినిమాలను డైరెక్ట్‌గా ఆన్‌లైన్‌లో రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన చేస్తున్నారు. అదే బాటలో జ్యోతిక ప్రధాన పాత్రలో సూర్య నిర్మించిన పొన్‌ మగల్‌ వందాల్ సినిమాను డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. అయితే ఈ నిర్ణయంపై తమిళ థియేటర్ల యాజమాన్య సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది.

ఒకే వేళ సూర్య తమ సినిమాను డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ చేస్తే తరువాత అదే బ్యానర్‌లో రిలీజ్ చేసే సినిమాలేవి థియేటర్లలో ప్రదర్శించబోమని వార్నింగ్ ఇచ్చారు. అయితే ఈ విషయంలో తమిళ నిర్మాతలు మాత్రం సూర్యకు మద్దతుగా నిలిచారు. తాజాగా సూర్యకు మరో సమస్య ఎదురైంది. కేరళ థియేటర్ల యాజమాన్యాలు కూడా సూర్యకు ఇదే వార్నింగ్ ఇచ్చారు. పొన్‌ మగల్ వందాల్ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తే కేరళలోనూ థియేటర్ల ఆ బ్యానర్‌ సినిమాలు ప్రదర్శించబోమని తెలిపారు. మరో అడుగు ముందుకు వేసి సూర్య నటించిన సినిమాలను కూడా కేరళలో ప్రదర్శించబోమని తెలిపారు. దీంతో సూర్య, పోన్‌ మగల్ వందాల్ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసే ఆలోచనను విరమించుకుంటాడా అన్న టాక్ వినిపిస్తోంది.