సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ మరో సంచలనానికి తెరలేపాడు. వివాదాస్పద అంశాలనే కథలుగా ఎంచుకుని సినిమాలు తీస్తున్నారు. తాజాగా ఆయన మరో సెన్సేషన్‌ప్రాజెక్ట్ కి శ్రీకారం చుట్టబోతున్నాడు. ఏకంగా తన మిస్సింగ్‌ పైనే సినిమా తీయబోతున్నట్టు ప్రకటించారు. రెండు రోజుల క్రితం `ఆర్జీవీ మిస్సింగ్‌` పేరుతో ఓ ప్రాజెక్ట్ ని ప్రకటించినవిషయం తెలిసిందే. 

రియాలిటీకి ఫిక్షన్‌ జోడించి ఎఫ్‌ఆర్‌ అనే ఓ జోనర్‌నే క్రియేట్‌ చేశారు. ఈ జోనర్‌లో `ఆర్జీవీ మిస్సింగ్‌` సినిమా తీయబోతున్నారు. ఇందులో ప్రవన్ కళ్యాణ్, ఒమేగా స్టార్,  సీబెఎన్, లాకేష్, వై.ఎస్‌ జగన్, కేసీఆర్‌, కేటీఆర్‌తోపాటు పోలీసులు, గ్యాంగ్ స్టర్స్, ఫ్యాక్షనిస్టులు కూడా నటించనున్నారని ట్వీట్‌ చేశారు. అయితే లీగల్‌ ఇబ్బందులు తలెత్తకుండా ఇంగ్లీష్‌ స్పెల్లింగ్‌లో ఛేంజెస్‌ చేశారు. ఈ సినిమాని తన ఆర్జీవీ వరల్డ్ థియేటర్‌లో విడుదల చేయబోతున్నారు. 

ఈ చిత్రంలోని తన మిస్సింగ్ కేసులో ప్రధానంగా ముగ్గురుని అనుమానితులుగా ప్రకటించారు. వారిలో అత్యంత పవర్‌ఫుల్‌ స్టార్‌, ముంబయి అండర్‌ వరల్డ్‌తో సంబంధం ఉన్న మెగా ఫ్యామిలీ, అలాగే మాజీ ముఖ్యమంత్రి, ఫ్యాక్షనిస్టుల సహాయం తీసుకున్న ఆయన  కొడుకుని అనుమానితులుగా ఆర్జీవీ ప్రకటించి మరో సంచలనానికి తెరలేపాడు. ఇలా వాస్తవ ఘటనలకు కల్పితాన్ని జోడించి ఈ చిత్రం చేయబోతున్నట్టు తెలిపారు. 

ఆర్జీవీ ఈ కొత్త సినిమా ప్రకటనతో చిత్ర పరిశ్రమలో కలవరం ప్రారంభమైంది. ముఖ్యంగా మెగా ఫ్యామిలీ చాలా గుర్రుగా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ సారి ఏకంగా తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా ఇన్‌వాల్వ్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో అటు టాలీవుడ్‌, ఇటు గవర్నమెంట్‌ వర్మపై సీరియస్‌గా ఉన్నారట. వివాదాస్పద కథలతో సినిమాలు చేస్తూ చికాకు గురి చేస్తున్న నేపథ్యంలో ఆయనకు గట్టిగానే వార్నింగ్‌ ఇచ్చేందుకు రంగం సిద్ధమైందని తెలుస్తుంది. ఫిల్మ్ ఛాంబర్‌ నుంచి ఆయనపై యాక్షన్‌ తీసుకోవాలనుకుంటున్నారని టాక్‌. దీనిపై ఇటీవల వర్మ స్పందిస్తూ, నాకు టాలీవుడ్‌కి సంబంధం లేదని తెలిపారు. నా సొంత టెక్నీషియన్లు, సొంత ఆర్టిస్టులతో సొంత ఖర్చుతో సినిమా తీస్తున్నానని, అదే సమయంలో సొంత ఫ్లాట్‌ఫామ్‌లో రిలీజ్‌ చేస్తున్నానని, దానితో ఎవరికీ సంబంధం లేదని చెప్పారు. ఈ లెక్కన ఇప్పట్లో వర్మని ఎవరూ ఏం చేయలేరని చెప్పకనే చెప్పారు. 

దీంతో చైనా మాదిరి వర్మ దూకుడికి అడ్డూ అదుపూ లేదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అదే సమయంలో నెటిజన్లు తమ దైన స్టయిల్‌లో వర్మపై కామెంట్‌ చేస్తున్నారు. వర్మని ఢీ కొట్టే మగాడు ఇంకా పుట్టలేదు అంటూ సెటైర్లు వేస్తున్నారు. మరికొందరు ఆయనపై విమర్శలతో మండిపడుతున్నారు. ఇది కూడా తన పబ్లిసిటీ స్టంట్‌ అని, తను ఇంకా సెలబుల్‌ డైరెక్టర్‌ అని నిరూపించుకునే ప్రయత్నమంటున్నారు. ఏదేమైనా వర్మ కరోనా సమయంలో రెస్ట్ లేకుండా బ్యాక్‌ టూ బ్యాక్‌ సినిమాలతో దూసుకుపోవడం విశేషంగా చెప్పుకోవాలి.