కెరీర్ ఆరంభంలోనే ఎన్టీఆర్ ఆది లాంటి ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ చిత్రంతో నటించాడు. ఫ్యాక్షన్ కథలకు కాలం చెల్లింది అనుకుంటున్న సమయంలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మ్యాజిక్ చేశారు. ఎన్టీఆర్ హీరోగా ఫ్యాక్షన్ కథతో రూపొందించిన అరవింద సమేత వీర రాఘవ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. 

ఈ చిత్రంలో ఎన్టీఆర్ కి జోడిగా పూజా హెగ్డే నటించింది. జగపతి బాబు విలన్ గా అదుర్స్ అనిపించాడు. తమన్ సంగీత దర్శకుడు. ఇటీవల సంతోషం అవార్డ్స్ 2019 వేడుకలు ఘనంగా జరిగాయి. సంతోషం 2019 అవార్డ్స్ లో తమన్ ఉత్తమ సంగీత దర్శకుడిగా అరవింద సమేత చిత్రానికి గాను అవార్డు సొంతం చేసుకున్నాడు. 

జీవిత రాజశేఖర్ దంపతుల చేతుల మీదుగా తమన్ ఈ అవార్డు అందుకున్నాడు. తమన్ వేదికపై మాట్లాడుతూ యంగ్ టైగర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కు కృతజ్ఞతలు తెలిపాడు. వారి వల్లే తనకు ఈ అవార్డు దక్కిందని తమన్ తెలిపాడు. నమ్మకం లేకపోతే మనం కనీసం షూ కూడా వేసుకోము. అలాంటిది త్రివిక్రమ్ శ్రీనివాస్, తారక్ తనపై నమ్మకంతో ఇంతటి భారీ చిత్రానికి సంగీతం అందించే అవకాశం ఇచ్చారని తమన్ తెలిపాడు. 

ఈ సందర్భంగా ఈ అవార్డుని మా తారక్ అన్నయ్యకు అంకితం ఇస్తున్నా అని తమన్ తెలిపాడు. తారక్ నటించిన ఐదు చిత్రాలకు తాను సంగీతం అందించానని తమన్ తెలిపాడు. అరవింద సమేత చిత్రానికి లెజెండ్రీ గేయ రచయిత సిరివెన్నెల గారు అద్భుతమైన సాహిత్యం అందించారని తమన్ ప్రశంసించాడు. 

టాలీవుడ్ లో సంగీత దర్శకుడిగా తమన్ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. అల్లు అర్జున్ నటిస్తున్న అల వైకుంఠపురములో, సాయిధరమ్ తేజ్ ప్రతి రోజు పండగే, రవితేజ డిస్కో రాజా లాంటి స్టార్ హీరోల చిత్రాలకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. అల వైకుంఠపురములో చిత్ర సాంగ్స్ యూట్యూబ్ లో సంచనలం సృష్టిస్తున్నాయి.