విజయ్ దేవరకొండ వంటి స్టార్ ఏం చేస్తాడా అని అభిమానులంతా వెయ్యి కళ్లతో ఎదురుచూస్తూంటారు. ఈ విషయం సినిమా నిర్మాతలకు స్పష్టంగా తెలుసు. అందుకే ఆయన చేత తమ సినిమా ట్రైలర్స్, టీజర్స్ వంటివి లాంచ్ చేయించుకుంటే మంచి రెస్పాన్స్ వస్తుందని, అందరి దృష్టిలో పడుతుందని ప్లాన్ చేస్తారు. అలాగే తాజాగా ఆయన ఓ హాలీవుడ్ చిత్రం తెలుగు ట్రైలర్ ని రిలీజ్ చేస్తున్నారు.

వివరాల్లోకి వెళితే...హాలీవుడ్‌ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన సైన్స్‌ ఫిక్షన్‌ మూవీ.. టెర్మినేటర్‌. ఆ  సిరీస్‌లో వచ్చే సినిమాలకు వరల్డ్ వైడ్‌ చాలా క్రేజ్ ఉంది. తాజాగా ఈ సిరీస్‌లో ఆరవ సినిమాగా ‘టెర్మినేటర్: డార్క్ ఫేట్ ’ వస్తుంది. ఆర్నాల్డ్ ష్వార్జ్‌నెగ్గర్ మరోసారి టెర్మినేటర్‌గా అలరించనుండగా, 'డెడ్‌పూల్' ఫేమ్ టిమ్ మిల్లర్ డైరెక్ట్ చేస్తున్నాడు. ప్రముఖ దర్శక నిర్మాత జేమ్స్ కెమరూన్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఇంగ్లీష్ ట్రైలర్ ఇప్పటికే  రిలీజ్ అయ్యి యూట్యూబ్ లో అత్యధిక వ్యూస్ తో దూసుకుపోతోంది.

'టెర్మినేటర్ 2 : జడ్జిమెంట్ డే'కు కంటిన్యూషన్‌గా రూపొందుతున్న ‘టెర్మినేటర్: డార్క్ ఫేట్ ’ఈ చిత్రాన్ని తెలుగు, కన్నడ,తమిళ భాషల్లోనూ రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా తెలుగు ట్రైలర్ ని టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ చేతులమీదుగా ఈ రోజు ఉదయం 11 గంటలకు హైదరాబాద్ లోని తాజ్ వివంటాలో ఎంతో గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నట్లు ఆ సినిమా యూనిట్ ఒక ప్రకటన రిలీజ్ చేసింది.

‘నా పేరు సారా కానర్‌. ఆగస్టు 29, 1997.. అది జడ్జిమెంట్‌ డే. కానీ, నేను నా భవిష్యత్తును మార్చుకున్నాను. మూడు బిలియన్‌ (300 కోట్ల మంది) జీవితాల్ని కాపాడాను..’ అంటూ.. లిండా హామిల్టన్ గతాన్ని గుర్తు చేసుకోవడంతో స్టార్ట్ అయిన ట్రైలర్ ఇంట్రస్టింగ్‌గా ఉంది.

ఈ సినిమాలో మెకంజీ డేవిస్, నటాలియా రేయిస్, గాబ్రియేల్ లూనా లతో పాటు యాక్షన్ హీరో ఆర్నాల్డ్ స్క్వార్జ్ నెగ్గర్ మరియు లిండా హామిల్టన్ కూడా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. కాగా ఈ సినిమా నవంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో రిలీజ్ కానుంది.