Asianet News TeluguAsianet News Telugu

దేవుడిచ్చిన చెల్లె మృతి: విషాదంలో స్టార్ యాంకర్ ఉదయభాను

తెలుగు బుల్లితెర మీద ఒకప్పుడు స్టార్ యాంకర్‌గా ఓ వెలుగు వెలిగిన మల్టీ టాలెంటెడ్ ఉదయభాను విషాదంలో మునిగిపోయింది. ఓ కార్యక్రమం ద్వారా తనకు పరిచయం అయి తరువాత చెల్లెలిగా ప్రేమను పంచుకున్న ఓ మహిళ మరణించటంతో ఉదయభాను తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది.

Telugu Star Anchor Udayabhanu Lost God Given Sister
Author
Hyderabad, First Published Apr 18, 2020, 10:47 AM IST

ఒకప్పటి తెలుగు స్టార్ యాంకర్‌ ఉదయభాను ఈ లాక్‌ డౌన్‌ సమయంలో విషాదంలో మునిగిపోయింది. ఆమె చెల్లెలిగా భావించే రజితమ్మ అనే మహిళ అకస్మాత్‌గా మరణించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది ఆమె. ఈ సందర్భంగా రజితమ్మ గురించిన విశేషాలను కూడా అభిమానులతో పంచుకుంది ఉదయభాను.

(ఉదయభాను పోస్ట్ యథాతథంగా)  అశ్రు నివాళి :
రజితమ్మ నాకు దేవుడిచ్చిన బంగారు చెల్లెల్లలో ఒకరు... తను ఇక లేదు. 24 ఏళ్లకే నిండు నూరేళ్లు నిండిపోయాయి... తిరిగి రాని లోకాలకి వెళ్లిపోయింది... ఈ ఉదయం 10 గంటలకు అస్తమించింది నా చిట్టి చెల్లి రజితమ్మ..... నిశ్శబ్దంగా సడి చప్పుడు లేకుండా తన ప్రశ్నలకి జవాబు దొరకకముందే వెళ్లిపోయింది.

పొరపాటు పడకండి ఇది కరోనా మరణం కాదు... గాలి నీరు నింగిని కల్మషం చేసిన కరుణ లేని కర్కశుల వల్ల కలిగిన మరణం... మానవ తప్పిదాలకు స్వార్ధానికి ప్రత్యక్ష సాక్షి ఈ రజితమ్మ. 2014 నిగ్గదీసి అడుగు కార్యక్రమం చేస్తున్నప్పుడు నల్గొండ జిల్లా మర్రిగూడెం మండలం ఖుదాబక్షుపల్లి లో నాకు ఈ చిట్టి తల్లితో విడదీయలేని బంధం ఏదో ముడిపడిపోయింది.

ఆ ఊరి పేరు ఖుదాబక్ష్ అంటే అర్ధం - దేవుడు రక్షించుగాక అని.. కానీ మానవుడి స్వార్ధం ముందు దేవుడు కూడా ఆ పల్లెను రక్షించలేకపోయాడు. ఆలా ఎన్ని ఊర్లో అక్కడ. ఫ్లోరైడ్ రక్కసి కోరల్లో చిక్కుకున్న నిస్సహాయులైన బిడ్డలెందరో.. కలుషిత నీటి రూపం లో ఫ్లోరైడ్ విషం తాగుతున్న బిడ్డలెందరో.. తాము చేయని తప్పుకు జీవితాంతం శిక్షను అనుభవిస్తున్న అసహాయులు ఎందరో.. అలంటి బిడ్డే ఈ రజితమ్మ. తనని చూసి నా గుండె తరుక్కుపోయింది.. తనకు నా చేతనైంది చేయాలనీ సంకల్పించి తన కాళ్ళ మీద తాను నడవలేకపోయిన, తన జీవితం లో తలెత్తుకుని బ్రతకాలని ఓ చిన్ని ప్రయత్నం చేసాను. ఒక చిన్న కిరానా కొట్టు పెట్టించాను.. అప్పటినుంచి తన తుది శ్వాశ వరకు ఓటమి ఎరుగక ఎంత ముద్దుగా చక్కగా షాప్ ని నడుపుకుందో.. తను తన కుటుంబానికి భారం కాదు ఆసరా అయింది.. తన ఆత్మా విశ్వాసం ఎందరికో భరోసా నిచ్చింది.

ప్రతి పండక్కి తనకి కలిగిన ప్రతి సంతోషానికి నాకొక ఫోటో పంపేది.. షాప్ ముందు రంగురంగుల పెద్ద ముగ్గు వేసి, ముగ్గు మధ్యలో చిన్న బొడ్డెమ్మాలా కూర్చుని.. అక్క హ్యాపీ సంక్రాంతి.. అక్క హ్యాపీ దసరా.. అక్క హ్యాపీ దీపావళి.. అక్క హ్యాపీ BIRTHDAY..అక్క పాపలకి ముద్దులు అంటూ అందరికంటే ముందు తను WISHES పంపేది.. ఇప్పుడిక ఆ WISHES రావు.. ఇక నా చిట్టి చెల్లి లేదు.. గుండెలవిసి పోయేలా ఏడ్చినా ఇక రాదు.. ఏ జన్మ బంధమో తన గుండె నిండా నా పైన ఎంత ప్రేమో.. మాటల్లో చెప్పలేని దుఃఖం కట్టలు తెంచుకుని వస్తుంది.

ఖుదాభక్షపల్లి లో భూగర్భంలోకి నీరింకినట్టు నా కళ్ళలో నీళ్లింకిపోతున్నాయి.  అక్క నేనెందుకు ఇలా అయ్యాను.. నా తప్పేంటి.. నాలా ఇంకెంతమంది.. ఇంకెంతకాలం ఇలా పుడతారు.. ఇలా తను సంధించిన ప్రశ్నలకి సమాధానం చెప్పేది ఎవ్వరు ? నా చిట్టి చెల్లి రజితమ్మ ఆత్మకు శాంతి కలగాలని మనసారా కోరుకుంటూ
రజిత వాళ్ళ అక్క ఉదయ భాను.

Follow Us:
Download App:
  • android
  • ios