హైదరాబాద్:  సినీ నటి వాణిశ్రీ ఇంట విషాద సంఘటన  చోటు చేసుకుంది. వాణిశ్రీ కుమారుడు అభినయ్ వెంకటేష్ గుండెపోటుతో మరణించినట్లు వార్తలు వస్తున్నాయి.. నిద్రలో ఉండగానే ఆయనకు గుండెపోటు వచ్చినట్లు సమాచారం. దాంతో ఆయన తుది శ్వాస విడిచాడు.

చెన్నైలోని ఓ ప్రైవేట్ వైద్యశాలలో వైద్య విద్యను అభ్యసిస్తున్న అభినయ వెంకటేష్ నిద్రలో గుండెపోటు రావడంతో దుర్మరణం చెందారు. వాణిశ్రీకి కుమారుడు, కుమార్తె సంతానం. వాణిశ్రీ కుమారుడు హఠాన్మరణంతో సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. చెన్నైలో ఆయన శనివారం తెల్లవారు జామున ఆయన మరణించారు.

వాణిశ్రీ తెలుగు సినిమాల్లోనే కాకుండా తమిళ, కన్నడ, మలయాళ సినిమాల్లో కూడా నటిచారు. 1970 దశకాల్లో ఆమె తెలుగు సినీ ప్రపంచాన్ని ఏలారు. తెలుగు అగ్రశ్రేణి నటిగా వెలుగొందారు. పెళ్లి చేసుకున్న తర్వాత సినీ రంగం నుంచి తప్పుకున్నారు. 1980 దశకంలో తల్లి పాత్రలు వేస్తూ మళ్లీ వెండి తెర మీద కనిపించారు.