చెన్నై: తెలుగు సినీ నటి వాణిశ్రీ కుమారుడు అభినయ్ వెంకటేష్ ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. అభినయ్ వెంకటేష్ గుండెపోటుతో నిద్రలోనే మరణించినట్లు తొలుత వార్తలు వచ్చాయి. పోలీసులు తొలుత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. అయితే, ఆయన తిరుక్కలి కుండ్రం ఫామ్ హౌస్ లో ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. 

ప్రభుత్వాస్పత్రిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న అభినయ్ వెంకటేష్ శుక్రవారం రాత్రి చెంగల్పట్టు వెళ్లారు. కుమారుడితో సరదా గడిపిన తర్వాత ఆయన ఫామ్ హౌస్ లో ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. బెంగళూరు నుంచి వెళ్లి వచ్చి క్వారంటైన్ లో ఉంటున్నట్లు తెలుస్తోంది. తిరుక్కలి కుండ్రం పోలీసు స్టేషన్ లో అభినయ్ వెంకటేష్ మృతిపై కేసు నమోదైంది.

 సినీ నటి వాణిశ్రీ ఇంట విషాద సంఘటన  చోటు చేసుకుంది. వాణిశ్రీ కుమారుడు అభినయ్ గుండెపోటుతో మరణించినట్లు తొలుత వార్తలు వస్తున్నాయి. నిద్రలో ఉండగానే ఆయనకు గుండెపోటు వచ్చినట్లు చెప్పారు. అయితే ఆయన తాడుతో ఉరి వేసుకుని మరణించినట్లు తెలుస్తోంది.

మృతదేహాన్ని వాణిశ్రీ నివాసానికి తీసుకుని వచ్చారు. సినీ పరిశ్రమకు చెందినవారు ఆమె ఇంటికి చేరుకుంటున్నారు. ఆమె నివాసం వద్ద తీవ్ర విషాద వాతావణం చోటు చేసుకుంది. వాణిశ్రీకి ఓ కుమారుడు, ఓ కూతురు ఉన్నారు. 

వాణిశ్రీ తెలుగు సినిమాల్లోనే కాకుండా తమిళ, కన్నడ, మలయాళ సినిమాల్లో కూడా నటిచారు. 1970 దశకాల్లో ఆమె తెలుగు సినీ ప్రపంచాన్ని ఏలారు. తెలుగు అగ్రశ్రేణి నటిగా వెలుగొందారు. పెళ్లి చేసుకున్న తర్వాత సినీ రంగం నుంచి తప్పుకున్నారు. 1980 దశకంలో తల్లి పాత్రలు వేస్తూ మళ్లీ వెండి తెర మీద కనిపించారు.