ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. అనంతరం కుడివైపున హైదరాబాద్‌ నుంచి వనపర్తి వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. 


తెలుగు టీవీ పరిశ్రమలో విషాదం నెలకొంది. త్రినయిని సీరియల్‌తో పాపులర్‌ అయిన బుల్లితెర నటి పవిత్ర జయరాం రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందింది. వివరాల్లోకి వెళితే.... మహబూబ్‌నగర్‌ జిల్లా భూత్పూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని శేరిపల్లి(బి) గ్రామం సమీపంలో ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. అనంతరం కుడివైపున హైదరాబాద్‌ నుంచి వనపర్తి వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. 

ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పవిత్ర జయరాం అక్కడికక్కడే మరణించింది. కర్ణాటకలోని తన స్వగ్రామానికి వెళ్లి తిరిగొస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ యాక్సిడెంట్‌లో పవిత్ర జయరాం బంధువు ఆపేక్ష, డ్రైవర్‌ శ్రీకాంత్‌, సహ నటుడు చంద్రకాంత్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.

ఇక పవిత్ర జయరామ్‌కు ఒక కూతురు, ఒక కొడుకు ఉన్నారు. రీసెంట్ గా ఇంటర్వూలో ఆమె పెద్దగా చదువుకోకపోవడంతో ఆమె హౌస్‌ కీపర్‌గా, సేల్స్‌ గర్ల్‌గా, లైబ్రరీ అసిస్టెంట్‌గా చిన్న చిన్న పనులు చేసానని చెప్పారు. కెరీర్ ప్రారంభంలో ఓ కన్నడ దర్శకుడి దగ్గర అసిస్టెంట్‌గా చేరింది. ఆ పరిచయంతో సీరియల్స్‌లో చిన్న చిన్న పాత్రలు చేసింది. కన్నడలో రొబో ఫ్యామిలీ అనే సీరియల్‌తో బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చింది. నిన్నే పెళ్లాడతా సీరియల్‌తో తెలుగులో అవకాశం దక్కించుకుంది. త్రినయిని సీరియల్‌తో మంచి పేరు తెచ్చుకుంది.