హిందీ బుల్లితెరపై పలు టీవీ సీరియల్స్ లో నటిస్తూ బిజీగా గడుపుతోన్న నటి తేజస్వి ప్రకాష్ కి చేదు అనుభవం ఎదురైంది. తన ఫోన్ హ్యాకింగ్ బారిన పడడంతో.. ఆమె నెంబర్ నుండి స్నేహితులకు అసభ్య వీడియో కాల్స్ వెళ్లాయి.

ఈ విషయాన్ని మీడియాతో పంచుకున్న తేజస్వి తన వాట్సాప్ నెంబర్ నుండి వచ్చే వీడియో కాల్స్ లిఫ్ట్ చేయొద్దని తెలిపింది. తను టీవీ సీరియల్ షూటింగ్ లో ఉన్న సమయంలో ఓ వ్యక్తి నుండి కాల్ వచ్చిందని.. ఫోన్ ఎత్తగానే అతడు అసభ్యంగా వికృత చర్యలకు పాల్పడుతూ కనిపించాడని.. ఒక్కసారిగా అసహ్యం వేసిందని.. ఆ సమయంలో తన చుట్టూ చాలా మంది ఉన్నారని చెప్పుకొచ్చింది.

తన ఫోన్ ని హ్యాక్ చేసి తన స్నేహితులతో చాట్ చేసి వాళ్లకు కూడా ఇలాగే అసభ్యంగా వీడియో కాల్స్ చేశాడని పేర్కొన్నారు. ఈ విషయంపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పిన ఈ బ్యూటీ తన తోటి నటీమణులకు కూడా ఇలాంటి చేదు అనుభవాలు ఎదురయ్యాయని చెప్పుకొచ్చారు.

తన ఫోన్ నుండి ఈ కాల్స్ వెళ్లడంతో వాళ్లంతా షాక్ అయ్యారని.. తనేంటోపూర్తిగా తెలిసిన వాళ్లు కాబట్టి తనను తప్పుగా అర్ధం చేసుకోలేదని.. అయితే ఈ ఘటన తనను ఎంతో మానసిక వేదనకి గురి చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.

అందరూ జాగ్రత్తగా ఉండాలని.. రోజురోజుకి హ్యాకర్ల ఆగడాలు మితిమీరిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం తాను షూటింగ్ లో బిజీగా ఉన్న కారణంగా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయలేకపోతున్నానని చెప్పుకొచ్చింది.