సక్సెస్ వచ్చినప్పటికీ మరో సినిమా చేయాలంటే నేటితరం దర్శకులు చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. ఆఫర్స్ ఎన్ని వస్తున్నా ఆచి తూచి కథలను ఎంచుకుంటున్నారు. తొందరపడిన దర్శకులు మాత్రం ఊహించని విధంగా డిజాస్టర్స్ ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇటీవల ఘాజి దర్శకుడు సంకల్ప్ రెడ్డి అంతరిక్షం సినిమా చేసి ఫెయిల్ అయ్యాడు.

ఇక పెళ్లి చూపులు దర్శకుడు తరుణ్ భాస్కర్ చేసిన రెండవ సినిమా ఈ నగరానికి ఏమైంది కూడా పెద్దగా సక్సెస్ కాలేదు. దీంతో అప్ కమింగ్ దర్శకులకు సెకండ్ మూవీ చేయడం క్లిష్టంగా మారింది. ఇక అలాంటి పొరపాటు చేయకూడదని లేటయినా మంచి కాన్సెప్ట్ యథా రావాలని టాక్సీ వాలా దర్శకుడు రాహుల్ సంక్రిత్యన్ సరికొత్త కథతో సిద్దమవుతున్నాడు.

ఇప్పటికే ఒక వెర్షన్ స్క్రిప్ట్ చేసుకొని న్యాచురల్ స్టార్ కి వినిపించినట్లు సమాచారం. నానికి కాన్సెప్ట్ నచ్చినప్పటికీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి కాస్త తడబడుతున్నట్లు టాక్. అయితే స్క్రీన్ ప్లేలో కాస్త మార్పులు చేసి మరో వెర్షన్ ని రెడీ చేసుకొమ్మని నాని యువ దర్శకుడికి సలహా ఇచ్చినట్లు టాక్. ఇకపోతే ప్రస్తుతం నాని 'V' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాలో నాని నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నాడు. అలాగే 26వ సినిమాని శివ నిర్వాణ డైరెక్షన్ లో చేస్తున్నాడు. ఇటీవల ఆ సినిమాకు సంబందించిన టైటిల్(టక్ జగదీశ్) లుక్ ని రిలీజ్ చేశారు. ఇక 27వ సినిమాను నాని రాహుల్ డైరెక్షన్ లో చేసే అవకాశం ఉంది. మరి ఆ సినిమా ఎప్పుడు మొదలవుతుందో చూడాలి.