రేనాటి వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రలో నటించాలనేది మెగాస్టార్ చిరంజీవి దశాబ్దాల కల. పరుచూరి బ్రదర్స్ ఎన్నో ఏళ్ల క్రితం సిద్ధం చేసిన ఈ చిత్ర కథలో చిరంజీవి నటించడం ఇప్పటికి సాధ్యమైంది. స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో, రాంచరణ్ నిర్మాణంలో సైరా చిత్రం రూపుదిద్దుకున్న సంగతి తెలిసిందే. 

సైరా విడుదల తర్వాత చిరంజీవి పలువురు రాజకీయ ప్రముఖుల్ని కలిశారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ ని కలసి సైరా చిత్రం చూడాలని రిక్వస్ట్ చేశారు. అలాగే ఢిల్లీ వెళ్లి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుని కలుసుకున్నారు. ఆయనతో కలసి సైరా చిత్రాన్ని చూశారు. 

చిరంజీవి రాజకీయ ప్రముఖుల్ని కలుసుకోవడంపై మీడియాలో అనేక ఊహాగానాలు వినిపించాయి. చిరంజీవి రాజ్యసభ పదవి అందుకోబోతున్నారని కొందరు కామెంట్స్ చేశారు. అదే విధంగా టాలీవుడ్ లో దాసరి స్థానాన్ని దక్కించుకునేందుకు చిరంజీవి ప్రయత్నిస్తున్నట్లు కూడా కామెంట్స్ వచ్చాయి. 

దీనిపై ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్, వెంకయ్య నాయుడుతో చిరంజీవి భేటీపై రాజకీయ కామెంట్స్ చేయడం పెద్ద కామెడీ అని తమ్మారెడ్డి అన్నారు. చిరంజీవి గారు వాళ్ళని కలిసింది సైరా చిత్రం కోసం. కానీ చిరంజీవి పేరుమీద పొలిటికల్ కామెంట్స్ చేస్తే అవి వైరల్ అవుతాయి. అందుకే ఇలాంటి ఊహాగానాలు పుట్టుకొచ్చాయి అని తమ్మారెడ్డి అన్నారు. 

చిరంజీవి గారికి రాజ్యసభ పదవి దక్కబోతోంది.. దాసరి స్థానం దక్కించుకోబోతున్నారు ఇలాంటి కామెంట్స్ విన్నప్పుడు నాకు నవ్వొస్తుందని తమ్మారెడ్డి అన్నారు. చిరంజీవి గారు ఆల్రెడీ రాజకీయాలు చూసొచ్చి సినిమాలు చేస్తున్నారు. 

ఇక టాలీవుడ్ లో దాసరి స్థానం అంటారా.. ప్రస్తుతం ఉన్నవారిలో మెగాస్టారే బిగ్ స్టార్. ఇక్కడ ఆయన ఏ కార్యక్రమం చేసినా అడ్డు చెప్పేవారు లేరు అని తమ్మారెడ్డి వ్యాఖ్యానించారు. అలాంటిది ఆయన టాలీవుడ్ లో దాసరి స్థానం కోసం ప్రయత్నిస్తున్నారనడం హాస్యాస్పదం అని తమ్మారెడ్డి తెలిపారు.