హైదరాబాద్: తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ఆరోగ్య పరిస్థితిపై హైదరాబాదులోని జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రి వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదలర చేశారు. రజినీకాంత్ ఆరోగ్యం నిన్నటి కన్నా మెరుగ్గా ఉందని వారు చెప్పారు. నిన్నటితో పోలిస్తే ఆయన బీపీ నియంత్రణలో ఉందని చెప్పారు. 

వైద్య పరీక్షలకు సంబంధించిన నివేదికలు ఈ రోజు సాయంత్రానికి వస్తాయని వైద్యులు చెప్పారు. రజినీకాంత్ ను డిశ్చార్జీ చేసే విషయంపై ఈ రోజు సాయంత్రం నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఈ రోజు కూడా రజినీకాంత్ కు మరిన్ని పరీక్షలు నిర్వహించనున్నారు.

బీపీ హెచ్చతగ్గులంతో రజినీకాంత్ శుక్రవారం ఉదయం 9 గంటలకు అపోలో ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తమవుతోంది. చిరంజీవి, మోహన్ బాబు వంటి పలువురు ప్రముఖులు ఆయన ఆరోగ్యంపై ఆరా తీస్తున్నారు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నారు. 

అన్నాతే సినిమా షూటింగ్ కోసం రజినీకాంత్ ఇటీవల హైదరాబాదు వచ్చారు. రామోజీ ఫిల్స్ సిటీలో షూటింగ్ జరుగుతుండగా బృందంలోని ఆరుగురికి కరోనా పాజిటివ్ వచ్చింది. 

దాంతో రజినీకాంత్ ఈ నెల 22వ తేదీన కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఈ పరీక్షల్లో ఆయనకు నెగెటివ్ వచ్చింది. అయినప్పటికీ ఆయన హోం క్వారంటైన్ కు వెళ్లారు. అకస్మాత్తుగా శుక్రవారం ఆయన ఆరోగ్యం క్షీణించింది. దాంతో ఆయనను ఆస్పత్రిలో చేర్చారు. 

రజినీకాంత్ కు కరోనా పాజిటివ్ వచ్చిందనే పుకార్లు షికారు చేశాయి. అయితే, రజినీకాంత్ కు కోవిడ్ లక్షణాలు లేవని వైద్యులు స్ప,ష్టం చేశారు.