రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత సుకుమార్ మరో చిత్రాన్ని ప్రారంభించలేదు. మొదట మహేష్ తో సినిమా చేసేందుకు ప్రయత్నించాడు. కానీ ఆ ప్రయత్నాలు ఫలించలేదు. దీనితో అల్లు అర్జున్ కి ఓ పవర్ ఫుల్ మాస్ స్టోరీ చెప్పి ఒప్పించాడు. త్వరలోనే ఈ చిత్రం పట్టాలెక్కబోతోంది. 

ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ చిత్రం ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అల్లు అర్జున్ అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ ని నడిపించే వ్యక్తిగా కనిపించబోతున్నట్లు టాక్. దీని కోసం సుకుమార్ బన్నీ పాత్రని మాస్ యాంగిల్ లో చూపించబోతున్నట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ లుక్ పూర్తిగా మార్చేసి.. లుంగీ, బనియన్ లో ఊరమాస్ గా అల్లు అర్జున్ ని ప్రొజెక్ట్ చేయబోతున్నాడు. 

ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో తెరక్కుతున్న ఈ చిత్రంలో విలన్ కూడా అంతే ప్రత్యేకంగా ఉండాలి. కాబట్టి తమిళ క్రేజీ హీరో విజయ్ సేతుపతిని విలన్ పాత్రకు ఎంచుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. 

విజయ్ సేతుపతి ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా చిత్రంలో కీలక పాత్రలో నటించాడు. సాయిధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ నటిస్తున్న ఉప్పెన చిత్రంలో విలన్ విజయ్ సేతుపతినే. విజయ్ విలక్షణ నటనకు ఆకర్షితులవుతున్న దర్శక నిర్మాతలు అతడికి మరిన్ని అవకాశాలు ఇస్తున్నారు. 

అక్టోబర్ 30న బన్నీ, సుకుమార్ చిత్రం ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. సినిమా లాంచింగ్ రోజున సుకుమార్ మరిన్ని విషయాలు బయటపెట్టే అవకాశం ఉంది. బన్నీ, సుక్కు కాంబోలో ఇప్పటికే ఆర్య, ఆర్య 2 చిత్రాలు వచ్చాయి.