'దర్బార్' సినిమా నష్టాల కారణంగా బయ్యర్లంతా కలిసి ఉద్యమం చేస్తున్నారు. ఈ సినిమాని కొనడం వలన సుమారు రూ.50 కోట్లకు పైగా నష్టపోవడంతో న్యాయం చేయాలంటూ ఇటీవల రజినీకాంత్ ని కలవడానికి ప్రయత్నించారు. తము నష్టాలపాలైతే నిర్మాణ సంస్థ పట్టించుకోవడం లేదని.. హీరో రజినీకాంత్, దర్శకుడు మురుగదాస్ తమకు న్యాయం చేయాలని బయ్యర్లు కోరుతున్నారు.

అయితే వారి నుండి రెస్పాన్స్ లేకపోవడంతో బయ్యర్లు కోర్టుకి వెళ్లారు. దర్శకుడు మురుగదాస్ పై ఫిర్యాదు చేసి.. తమకు జరిగిన నష్టంపై బాధ్యత వహించాలని కోరారు. అయితే ఈ ఇష్యూపై తమిళ దర్శకుల సంఘం అధ్యక్షుడు, నగరి ఎమ్మెల్యే రోజా భర్త సెల్వమణి స్పందించారు. సినిమా వల్ల నష్టం వస్తే బాధ్యత వహించాల్సింది దర్శక, నిర్మాతలు కాదని.. వారిని బాధ్యులని చేసి కేసులు పెట్టడం కరెక్ట్ కాదంటూ వ్యాఖ్యానించారు.

తమిళ దర్శకుల సంఘంలో సభ్యుడైన మురుగదాస్ కి తాము అండగా నిలుస్తామని.. సినిమాని కొనడం, అమ్ముకోవడం బయ్యర్లకు సంబంధించిన విషయమని అన్నారు. సినిమాకి నష్టాలు వచ్చాయి కాబట్టి దర్శకుడు ఇవ్వాలని అంటున్నారు.. అదే లాభాలు వస్తే డైరెక్టర్ కి ఇస్తారా..? అంటూ ప్రశ్నించారు.

అయినా ఇలాంటి పరిస్థితి రావడానికి హీరోగా రజినీకాంత్ కారణమని ఆయనపై విమర్శలు గుప్పించారు సెల్వమణి. గతంలో సినిమాని కొని నష్టపోయిన బయ్యర్లకు తిరిగి డబ్బులు ఇచ్చే సాంప్రదాయాన్ని రజినీకాంత్ తీసుకొని రావడంతో సినిమా ఆడని ప్రతిసారి ఇలాంటి జరుగుతూనే ఉంటుందని.. ఆయనకి ఇవ్వాలనిపిస్తే తిరిగి ఇవ్వొచ్చని.. ఇందులోకి దర్శకులను లాగడం కరెక్ట్ కాదంటూ చెప్పుకొచ్చారు. సెల్వమణి.. రజినీకాంత్ ని ఉద్దేశిస్తూ చేసిన కామెంట్స్ పై సూపర్ స్టార్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.