చెన్నై: తమిళ సినీ నటి విజయలక్ష్మి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. సోషల్ మీడియాలో వేధింపులు, బెదిరింపుల వల్లనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె ముందుగా ఓ వీడియోలో చెప్పింది. నామ్ తమిళర్ పార్టీ నేత సీమన్, పనన్ కట్టు పడైకి చంెదిన హరి నాడార్ అనుచరులు తనను వేధిస్తున్నట్లు ఆరోపిస్తూ విజయలక్ష్మి కొన్ని వీడియోలను విడుదల చేశారు. 

ఆదివారంనాడు ఫేస్ బుక్ లో ఓ వీడియో పోస్టు చేసిన విజయలక్ష్మి కొన్ని పిల్స్ తీసుకుంటే రక్తంపోటు తగ్గిపోయి మరణం సంభవిస్తుందని అన్నారు. సీమన్, హరి నాడార్ అనుచరుల వేధింపుల కారణంగానే తాను ఆత్మహత్యయత్నం చేసినట్లు ఆమె చెప్పారు. ఆన్ లైన్ లో తనను వేధిస్తున్నందుకు గాను వారిద్దరనీ అరెస్టు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. 

"ఇది నా చివరి వీడియో. సీమన్, అతడి పార్టీ కార్యకర్తల వల్ల గత నాలుగు నెలలుగా నేను తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నాను. నా కుటుంబాన్ని కాపాడుకోవడానికి చాలా ప్రయత్నం చేశాను. మీడియాలో నన్ను హరి నాడార్ అవమానించారు. నేను బీపీ మాత్రలు తీసుకుంటున్నా. మరి కాసేపట్లో నా బీపీ పడిపోతుంది. ఆ తర్వాత నేను మరణిస్తా" అని ఫేస్ బుక్ లో పోస్టు చేసిన చివరి వీడియోలో అన్నారు.

తన మరణం కనువిప్పు కావాలని ఆమె అన్నారు. సీమన్, హరి నాడార్ లను వదిలిపెట్టవద్దని ఆమె తన అభిమానులను కోరారు. ఆత్మహత్యా యత్న చేసిన విజయలక్ష్మిని చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చినట్లు తెలుస్తోంది.