తమిళ సినీరంగంలో ఇప్పుడిప్పుడే నటుడిగా ఎదుగుతున్న ఓ యువ నటుడు గుండెపోటుతో మృతి చెందాడు. 36 ఏళ్ల సేతురామన్‌ గురువారం రాత్రి 8 గంటల 45 నిమిషాలకు చెన్నైలో తుదిశ్వాస విడిచాడు. ఎంతో భవిష్యత్తు ఉన్న నటుడు ఇలా అర్ధాంతరంగా చనిపోవటంతో తమిళ సినీ పరిశ్రమ దిగ్బ్రాంతికి గురైంది.

సేతురామన్‌ కేవలం నటుడు మాత్రమే కాదు స్కిన్‌ డాక్టర్‌ కూడా . చెన్నైలో ఆయన సొంతంగా జీ క్లినిక్‌ పేరుతో ఓ హాస్పిటల్‌ ను నిర్వహిస్తున్నాడు. ఆయనకు భార్య ఏడాది వయసున్న కూతురు ఉన్నారు. తమిళ హాస్యనటుడు సంతానానికి సన్నిహితుడు కావటంతో ఆయన ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు సేతురామన్.

2013లో రిలీజ్‌ అయిన `కన్నా లడ్డూ తిన్నా ఆసయ్య` సేతురామన్‌ తొలి చిత్రం. మణికందన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సంతానం, సేతు, పవర్‌ స్టార్ శ్రీనివాసన్‌, విశాఖ సింగ్ లు ప్రధాన పాత్రల్లో నటించారు. అనంతరం వాలిబా రాజా, సక్కా పోడు పోడు అండ్‌ 50/50 లాంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయన అంత్యక్రియలు ఈ రోజు జరగనున్నాయి.