చెన్నై: తమిళ టీవీ స్టార్ చిత్ర భర్తను పోలీసులు చెన్నైలో అరెస్టు చేశారు. భర్త కొట్టడం వల్లనే తన కూతురు మరణించిందని చిత్ర తల్లి ఆరోపించిన నేపథ్యంలో ఈ అరెస్టు జరిగింది. చిత్ర ఆత్మహత్య చేసుకున్నట్లు పోస్టుమార్టంలో తేలిందని పోలీసులు చెప్పారు.

ఆర్థిక విషయాలు ఆమె ఆత్మహత్యకు దారి తీసినట్లు ప్రాథమిక విచారణలో తేలినట్లు పోలీసులు చెబుతున్నారు. చిత్ర భర్త హేమంత్ ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు అభియోగాలు మోపే అవకాశం ఉంది. 

డిసెంబర్ 10వ తేదీన చిత్ర ఓ హోటల్లో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. చిత్ర, హేమంత్ కొన్ని నెలలక్రితం వివాహం చేసుకున్నారు. ఓ టెలివిజన్ సీరియల్ లోని అతి సన్నిహితమైన దృశ్యాలకు హేమంత్ కు చిత్రపై కోపం పెంచుకున్నట్లు చెబుతున్నారు. 

సీరియల్ లో చిత్ర నటించిన ఓ సన్నివేశం అతనికి ఇష్టం లేదని అంటున్నారు. చిత్ర మరణించిన రోజున హేమంత్ ఆమెను తోసేసినట్లు కూడా భావిస్తున్నారు. సుదీర్ఘ విచారణ తర్వాత హేమంత్ ను పోలీసులు అరెస్టు చేశారు. చిత్ర మిత్రులను, సహ నటీనటులను కూడా పోలీసుుల ప్రశ్నించారు. 

గత వారం రాత్రి పొద్దు పోయిన తర్వాత చిత్ర, హేమంత్ హోటల్ కు చేరుకున్నారు. చిత్ర లోపలి నుంచి గదికి తాళం వేసుకుందని, డుప్లికేట్ కీతో హోటల్ సిబ్బంది గది తలుపులు తీశారని, అప్పటికే చిత్ర మరణించిందని హేమంత్ పోలీసులకు చెప్పాడు. 

చిత్ర పెళ్లి చేసుకున్న తర్వాత ఏడేళ్లు కూడా పూర్తి కాకుండానే మరణించింది. దీంతో రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ విడిగా కేసును దర్యాప్తు చేస్తున్నారు.