దర్శకుడు ఓంకార్ గతంలో రూపొందించిన 'రాజుగారి గది', 'రాజు గారి గది 2' సక్సెస్ కావడంతో దీన్ని ఫ్రాంచైజీగా చేసి వరుసగా సీక్వెల్స్ చేయడం మొదలుపెట్టాడు. దీనిలో భాగంగా తాజాగా 'రాజుగారి గది 3' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హారర్ కామెడీ అంశాలతో రూపొందించిన ఈ సినిమా మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది. ఇది ఇలా ఉండగా.. ఈ సినిమాలో మొదట హీరోయిన్ గా తమన్నాను అనుకున్నారు.

కానీ ఆమె స్థానంలో అవికా గౌర్ వచ్చి చేరింది. తమన్నా ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడం వెనుక అసలు కారణాన్ని ఇటీవల ఓ ప్రెస్ మీట్ లో ఓంకార్ వెల్లడించాడు. తమన్నాను హీరోయిన్ గా తీసుకున్నప్పుడు ఆమెకి లైన్ మాత్రమే చెప్పామని.. సినిమా మొదలుకావడానికి కొద్దిరోజుల ముందే ఫుల్ నేరేషన్ ఇచ్చామని.. దానికి ఆమె చాలా మార్పులు చెప్పారని ఓంకార్ అన్నారు. దీంతో ఆమెని తప్పించి అవికాని తీసుకున్నట్లు చెప్పారు.

 

తమన్నా తప్పుకోవడంతో హీరో పాత్రని పెంచేశామని.. ఒకవిధంగా ఆమె తప్పుకోవడం వలన మంచే జరిగిందని అన్నారు ఓంకార్. ఈ వ్యాఖ్యలపై తమన్నా గుర్రుగా ఉన్నట్లు  తెలుస్తోంది. తను ప్రాజెక్ట్ నుండి తప్పుకున్న విషయంలో ఓంకార్ చేసిన కామెంట్స్  ఆమెకి ఆగ్రహాన్ని తెప్పించాయట. దీంతో తన పీఆర్ తో ఓంకార్ ఫోన్ చేయించిందట. ఇకపై 'రాజు గారి గది 3' సినిమాకి సంబంధించిన ప్రెస్ మీట్స్ లో తన ప్రస్తావన రాకూడదని, తన పేరు ఎత్తినా ఊరుకోనని వార్నింగ్ ఇచ్చిందట తమన్నా.

దీనికి ఓంకార్ ఎలా రియాక్ట్ అయ్యాడనే విషయంలో క్లారిటీ లేనప్పటికీ అతడి ఈగో మాత్రం హర్ట్ అయ్యే ఉటుంది. నిజానికి తమన్నాకోసం అనుకున్న పాయింట్ ఆఫ్ వ్యూ కథ అలానే ఉందని.. వీలైతే దాన్ని 'రాజు గారి గది 4'గా తీసే ఛాన్స్ ఉందని, తమన్నా హీరోయిన్ గా ఉంటుందని చెప్పిన ఓంకార్ ఇక ఆ ప్రాజెక్ట్ విషయంలో తమన్నాని లైట్ తీసుకుంటాడేమో.. అసలే తమన్నాకి ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గుతున్నాయి.ఇలాంటి సమయంలో దర్శకుడితో గొడవ అంత మంచిది కాదేమో!